Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఆద్యంతం తీవ్ర ఒడుదొడుకుల మధ్య చలించాయి. చివరకు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ముగించాయి.

Updated : 25 Nov 2022 16:08 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య చలించాయి. నిన్నటి గరిష్ఠాల నేపథ్యంలో లాభాల స్వీకరణ, కీలక రంగాల్లో అమ్మకాల వెల్లువ, చైనాలో కరోనా కేసుల విజృంభణ వంటి పరిణామాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్‌ 20.96 పాయింట్ల స్వల్పలాభంతో 62,293.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28.65 పాయింట్లు లాభపడి 18,512.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 15 షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.60 వద్ద నిలిచింది.

మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో పూర్తిగా తమ పెట్టుబడుల్ని ఉపసహరించుకునేందుకు పీఎన్‌బీకి ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో కంపెనీ షేరు ఇంట్రాడేలో 8 శాతానికి పైగా పెరిగి రూ.54.90 వద్ద 21 నెలల గరిష్ఠానికి చేరింది. చివరకు 5.11 శాతం లాభపడి రూ.53.45 వద్ద స్థిరపడింది.

☛ మార్చి వరకు యూకేలో తయారీని తగ్గించాలని జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌రోవర్‌ నిర్ణయించింది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌ షేరు ఈరోజు 2.72 శాతం పెరిగి రూ.434.90 వద్ద ముగిసింది.

☛ హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్ ఇటీవలే 15 టన్నుల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్‌ మెల్టింగ్‌ ఫర్నేస్‌ ఏర్పాటును పూర్తిచేసింది. దీంతో కంపెనీ షేర్లకు గిరాకీ ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో ఈ షేరు 12 శాతం పెరిగి రూ.314.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 11.35 శాతం పెరిగి రూ.317.90 వద్ద స్థిరపడింది.

☛ మంగళూరులోని పెల్లెట్‌ ప్లాంట్‌ యూనిట్‌ పునఃప్రారంభమైన నేపథ్యంలో కేఐఓసీఎల్‌ షేరు ఇంట్రాడేలో 8 శాతానికి పైగా లాభపడింది. చివరకు 4.91 శాతం లాభపడి రూ.195.65 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు