Stock Market Update: లాభాల్లోకి వచ్చినా.. చివరకు తప్పని నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు.....

Updated : 10 May 2022 15:52 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత కోలుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. చివరకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య మదుపర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్‌డౌన్‌లు సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా ఫ్యూచర్స్‌, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం మధ్యాహ్నం సూచీల సెంటిమెంటును పెంచింది. 

ఉదయం సెన్సెక్స్‌ 54,309.31 వద్ద ఊగిసలాటలో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,226.33 - 54,857.02 మధ్య కదలాడింది. చివరకు 105.82 పాయింట్ల నష్టంతో 54,364.85 వద్ద ముగిసింది. 16,248.90 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 61.80 పాయింట్లు నష్టపోయి 16,240.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 16,197.30 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.31 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* అజంతా ఫార్మా షేర్లు ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడమే ఇందుకు కారణం. ఆ త్రైమాసికంలో ప్యాట్‌ ఆదాయం 5 శాతం కుంగింది.

* కోహినూర్‌ ఫుడ్స్‌ షేర్లు వరుసగా 21వ రోజు 5 శాతం పెరిగి అప్పర్‌సర్క్యూట్‌ని తాకాయి. ఈ స్టాక్‌ గత 21 రోజుల్లో 174 శాతం రిటర్న్స్‌ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం రూ.20.65 వద్ద స్థిరపడింది.

* డాబర్‌ ఇండియా మార్చితో ముగిసిన త్రైమాసికపు ఫలితాలు అంచనాలు అందుకోకపోవడంతో గతవారం రోజుల్లో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా కుంగాయి. ఈరోజు ఇంట్రాడేలో ఈ షేరు రూ.499.35 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది.

* జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో టాటా స్టీల్‌ షేర్లు గత ఐదు రోజుల్లో 10 శాతం నష్టపోయాయి. 52 వారాల గరిష్ఠ నుంచి ఇప్పటి వరకు 24 శాతం దిద్దుబాటుకు గురైంది. ఈరోజు ఇంట్రాడేలో ఈ షేరు 7 శాతానికి పైగా కుంగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు