Stock Market Update: ₹4.31 లక్షల కోట్ల సంపద ఆవిరి

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి....

Published : 06 May 2022 16:13 IST

ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల ఆసక్తి కనిపించకపోవడం గమనార్హం. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈరోజు రూ.4.31 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

ఉదయం సెన్సెక్స్‌ 54,928.29 వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,586.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 866.65 పాయింట్ల నష్టంతో 54,835.58 వద్ద ముగిసింది. 16,415.55 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 271.40 పాయింట్లు నష్టపోయి 16,411.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 16,340.90 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.38 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, విప్రో, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు..

అంతర్జాతీయంగా అమ్మకాలు: అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు అక్కడి మదుపర్లను అప్రమత్తం చేశాయి. నాస్‌డాక్‌ 2020 తర్వాత గురువారం అత్యధిక ఒకరోజు నష్టాన్ని నమోదు చేసింది. ఫెడ్‌ అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో చివర్ల్లో మార్కెట్లు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌, ఐరోపా సూచీలకు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

వడ్డీరేట్ల పెంపు: ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల కేంద్ర బ్యాంకులకు అనుగుణంగా ఆర్‌బీఐ సైతం వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆందోళనకర స్థాయిలో ఉండే అవకాశం ఉందన్న అంచనాలే ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయానికి కారణమని సమాచారం. మరోవైపు సీఆర్‌ఆర్‌ను సైతం 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఈ నెలాఖరు నాటికి ఆర్థిక వ్యవస్థ నుంచి దాదాపు రూ.80 వేల కోట్ల నగదును చలామణి నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరోవైపు గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను ఒకశాతం పెంచాయి. అంతకుముందు ఆస్ట్రేలియా సెంట్రల్‌ బ్యాంకు సైతం వడ్డీరేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. 

సురక్షిత మార్గాల వైపు మదుపర్లు: ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు అంచనాలను రేటింగ్‌ సంస్థలు తగ్గిస్తున్నాయి. దీంతో అధిక రిస్కు ఉండే పెట్టుబడి మార్గాల నుంచి మదుపర్లు నిష్క్రమిస్తున్నారు. బాండ్ల వంటి సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

  • గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలకు ముందు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు 1 శాతానికి పైగా కుంగాయి.
  •  జొమాటో, పాలసీబజార్‌, ఇన్ఫోఎడ్జ్‌ వంటి టెక్‌ ఆధారిత కంపెనీల షేర్లు 9 శాతానికి పైగా కుంగి 52 వారాల కనిష్ఠానికి చేరాయి.
  • మహీంద్రా ఆటోను మూడు ప్రత్యేక విభాగాలుగా విభజించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల్లో వినిపించింది.
  • గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో వోల్టాస్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతానికి పైగా కుంగాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని