Stock Market Update: కనిష్ఠాల నుంచి కోలుకున్నా.. నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు!

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. కానీ, లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి....

Updated : 02 May 2022 16:04 IST

ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు చివరకు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. కానీ, లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు (Fed Rate Hike), రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు ఇంట్రాడేలో మదుపర్లను కలవరపెట్టాయి. చైనాలో కరోనా (China Corona) వ్యాప్తి నేపథ్యంలో విధిస్తున్న కఠిన లాక్‌డౌన్‌లు కూడా సెంటిమెంటును దెబ్బతీశాయి. అయితే, అమెరికా ఫ్యూచర్స్‌ ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతుండడంతో సూచీలకు చివర్లో కాస్త మద్దతు దొరికింది. మరోవైపు గత కొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

ఉదయం సెన్సెక్స్‌ 56,429.45 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,412.62 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 84 పాయింట్ల నష్టంతో 56,975.99 వద్ద ముగిసింది. 16,924.45 వద్ద నష్టాలతో ప్రారంభమైన నిఫ్టీ చివరకు 33.45 పాయింట్లు నష్టపోయి 17,069.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,092.25 - 16,917.25 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.49 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. టైటన్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేర్లు ఇంట్రాడేలో 14 శాతానికి పైగా ఎగబాకాయి. గత రెండు రోజుల్లో ఈ షేరు 25 శాతం మేర లాభపడింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడమే ఇందుకు కారణం.

* హెచ్‌డీఎఫ్‌సీ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సంస్థ లాభం 16 శాతం పెరిగి రూ.3,700 కోట్లకు చేరింది. కంపెనీ రూ.30 డివిడెండును ప్రకటించింది. కంపెనీ షేర్లు ఈరోజు 1.5 శాతం మేర లాభపడ్డాయి.

* యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు దదాపు 8 శాతానికి పైగా లాభపడ్డాయి. రూమ్‌ ఎయిర్‌ కండీషనర్ల విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న ఈ సంస్థ విక్రయాలు పుంజుకోవడమే ఇందుకు కారణం.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో మేఘమణి ఆర్గానిక్స్‌ నికర లాభం 184 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 14 శాతం మేర లాభపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని