Stock Market Update: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. దీంతో గత మూడు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది....

Updated : 04 Jul 2022 15:52 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. దీంతో గత మూడు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఉదయం తీవ్ర ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నానికి కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలకు చివరి గంటలో మరింత మద్దతు లభించింది. ఇటీవల కనిష్ఠాల నేపథ్యంలో దిగువస్థాయిలో కొనుగోళ్లతో పాటు చమురు ధరలు దిగిరావడం మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు కమొడిటీ ధరలు తగ్గడం కూడా మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. 

ఉదయం సెన్సెక్స్‌ 52,851.67 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 53,301.99-52,674.81 మధ్య ట్రేడయ్యింది. చివరకు 326.84 పాయింట్లు లాభపడి 53,234.77 వద్ద ముగిసింది. 15,710.50 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 15,661.80 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 15,852.35 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 83.30 పాయింట్లు ఎగబాకి 15,835.35 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు నష్టాలు చవిచూశాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు...

* జూన్‌ త్రైమాసికంలో డీమార్ట్‌ ఆదాయం రెండింతలు పెరిగిందన్న కంపెనీ నివేదిక నేపథ్యంలో షేర్లు ఈరోజు ఓ దశలో ఐదు శాతం మేర లాభపడ్డాయి.

* చమురు ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ వల్ల కంపెనీ ఆదాయం దెబ్బతిననుందన్న నివేదిక నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేర్లు ఈరోజు 4 శాతం వరకు నష్టపోయాయి.

* ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్లు ఈరోజు దాదాపు 2 శాతం మేర నష్టపోయి 52 వారాల కనిష్ఠానికి చేరాయి. గత ఆరు నెలల్లో ఈ స్టాక్‌ 43 శాతం పతనాన్ని చవిచూసింది.

* లోహ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిలో చలించాయి. జూన్‌ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చునన్న అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎన్‌ఎండీసీ, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ వంటి కంపెనీలు 2-3 శాతం నష్టాన్ని చవిచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని