Stock market: కొనసాగిన లాభాల జోరు

సూచీలు రికార్డుల జోరు కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎం అండ్‌ ఎం షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.55 వద్ద ముగిసింది.

Published : 15 Jun 2024 02:41 IST

సమీక్ష

సూచీలు రికార్డుల జోరు కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎం అండ్‌ ఎం షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.55 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.12% నష్టంతో 82.65 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి నష్టపోయాయి. 

3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్లు: బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.434.88 లక్షల కోట్ల (దాదాపు రూ.5.21 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. గత 3 రోజుల్లో సంపద రూ.7.93 లక్షల కోట్లు పెరిగింది. 

సెన్సెక్స్‌ ఉదయం 76,912.38 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, 76,549.05 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 77,081.30 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 181.87 పాయింట్ల లాభంతో 76,992.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.70 పాయింట్లు పెరిగి 23,465.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,334.25- 23,490.40 పాయింట్ల మధ్య కదలాడింది.

  • పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో అంబుజా షేరు ఇంట్రాడేలో రూ.690 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.90% లాభంతో రూ.676.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,115.85 కోట్లు పెరిగి రూ.1.66 లక్షల కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభాలు నమోదుచేశాయి. ఎం అండ్‌ ఎం 2.20%, టైటన్‌     1.79%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.05%, రిలయన్స్‌   0.88%, టాటా మోటార్స్‌ 0.78%, అల్ట్రాటెక్‌ 0.73% లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా 1.38%, టీసీఎస్‌ 1.17%, విప్రో 1.05%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.93%, కోటక్‌ బ్యాంక్‌ 0.54% నష్టపోయాయి.
  • అదరగొట్టిన మహీంద్రా: దేశంలో రెండో అత్యంత విలువైన వాహన సంస్థగా మహీంద్రా అండ్‌ మహీంద్రా నిలిచింది. టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. వాహన సంస్థల్లో మారుతీ సుజుకీ (రూ.4.04 లక్షల కోట్లు), మహీంద్రా (రూ.3.63 లక్షల కోట్లు), టాటా మోటార్స్‌ (రూ.3.30 లక్షల కోట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • లగ్జరీ ఫర్నీచర్‌ బ్రాండ్‌ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీఓ జూన్‌ 21న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిని రూ.351-369గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.537 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు జూన్‌ 20న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం తమ అనుబంధ సంస్థ వెస్టర్న్‌ క్లస్టర్‌ 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వేదాంతా సెసా గోవా వెల్లడించింది.
  • రక్తపోటును తగ్గించే అజిల్‌సార్టాన్‌ మెడోక్సోమిల్, క్లోథలిడన్‌ మాత్రలను విక్రయించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తాత్కాలిక అనుమతి ఇచ్చినట్లు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ తెలిపింది. 
  • రుణాలు-అడ్వాన్సులు, వినియోగదారుల భద్రతకు సంబంధించి కొన్ని ఆదేశాలను పాటించనందుకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై రూ.1.45 కోట్ల జరిమానాను ఆర్‌బీఐ విధించింది. 
  • టాటా స్టీల్, టాటా మోటార్స్, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ ఆటోమోటివ్, టాటా పవర్, టీఎంఎల్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్, ఏబీజేఏ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ పీటీఏ లిమిటెడ్‌లకు టాటా గ్రూపు నుంచి సహకారం పెరిగే అవకాశం ఉండటం సానుకూల ప్రభావం చూపించొచ్చని భావించి ఈ ఆరు సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌పై సమీక్ష జరుపుతున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది.

సోమవారం మార్కెట్లకు సెలవు

బక్రీద్‌ సందర్భంగా సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేయనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని