Stock Market: మదుపర్ల అప్రమత్తత.. మార్కెట్ల ఊగిసలాట

దేశీయ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో

Published : 30 Jun 2022 15:47 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆద్యంతం లాభ నష్టాల్లో ఊగిసలాడిన సూచీలు చివరకు స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 8 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 19 పాయింట్లు తగ్గింది.

సూచీల పయనం సాగిందిలా..

డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించాయి. 52,897.16 వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 53,377.54 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే ఈ జోరు ఎంతోసేపు నిలువలేదు. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ 52,883.25 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. ఇలా ఆద్యంతం ఊగిసలాడిన సూచీ చివరకు 8 పాయింట్ల నష్టంతో 53,108.94 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 15,728.85 - 15,890 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 18.80 పాయింట్లు తగ్గి 15,780 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు కోలుకుని 78.98 వద్ద ముగిసింది.

నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు రాణించగా.. బజాజ్ ఆటో, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌, భారత్ పెట్రోలియం, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ, లోహ రంగ షేర్లు 1-2 శాతం మేర కుంగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని