Stock Market Update: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Published : 11 May 2022 09:38 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నేడు మిశ్రమంగానే ట్రేడువుతున్నాయి. గత కొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొన్ని కీలక స్టాక్‌లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. దాదాపు ఇదే కారణంతో దేశీయ సూచీలు సైతం ఉదయం ట్రేడింగ్‌లో సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే, ఈ లాభాలు ఎంతవరకు నిలబడతాయన్నది చూడాల్సి ఉంది. ఇటీవల మార్కెట్లను కలవరపెడుతున్న ద్రవ్యోల్బణం, మందగమన భయాల నుంచి ఎలాంటి ఉపశమనం లేకపోవడం గమనార్హం. అయితే, అంతకంతకూ పడిపోతున్న రూపాయిని ఆదుకోవడానికి ఆర్‌బీఐ చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లకు సానుకూలాంశం. మరోవైపు చమురు ధరలు తిరిగి 100 డాలర్లకు చేరువయ్యాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 168 పాయింట్ల లాభంతో 54,533 వద్ద, నిఫ్టీ (Nifty) 60 పాయింట్లు లాభపడి 16,300 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.22 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా, టైటన్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: అదానీ పోర్ట్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ ఇస్పత్‌ స్పెషల్‌ ప్రోడక్ట్స్‌, ఎంఆర్‌పీఎల్‌, ఎన్‌సీసీ, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌కేఎఫ్‌ ఇండియా

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

ఎంటార్‌ టెక్నాలజీస్‌: జీపీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ సంస్థను హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌ రూ.8.82 కోట్లతో కొనుగోలు చేయనుంది. దీనిపై కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంది.

ఏషియన్‌ పెయింట్స్‌: జనవరి-మార్చి త్రైమాసికానికి ఏషియన్‌ పెయింట్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.874.05 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.869.89 కోట్లతో పోలిస్తే ఈసారి అతి స్వల్పంగా పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,541.94 కోట్ల నుంచి 20.60 శాతం పెరిగి రూ.7,889.94 కోట్లకు చేరింది

సిప్లా: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఔషధ సంస్థ సిప్లా ఏకీకృత ప్రాతిపదికన రూ.362 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.413 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం తక్కువ.

ఎస్‌బీఐ: రూ.2 కోట్లు, అంతకుమించిన (బల్క్‌) టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మంగళవారం ప్రకటించింది. మరోవైపు రెండు బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.

వొడాఫోన్‌ ఐడియా: వొడాఫోన్‌ ఐడియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,563.1 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక నష్టం రూ.7,022.8 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 6.6 శాతం పెరిగి రూ.10,239.5 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని