Stock Market Update: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 13 May 2022 09:57 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం ఊగిసలాట ధోరణిలో పయనించాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన అక్కడి సూచీలు చివరకు కనిష్ఠాల నుంచి కోలుకొని స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. నాస్డాక్‌ అయితే, స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం సానుకూలంగా కదలాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆయా కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిచ్చే అవకాశం ఉందన్న ఆశలతో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అయితే, దేశీయంగా ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదు కావడం కొంత కలవరపెడుతున్న అంశం. గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 587 పాయింట్ల లాభంతో 53,518 వద్ద, నిఫ్టీ (Nifty) 194 పాయింట్లు లాభపడి 16,002 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.28 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టెక్ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ, ఆల్కెమ్‌ లేబోరేటరీస్‌, బంధన్‌ బ్యాంక్‌, ఎస్కార్ట్స్‌, హెచ్‌ఏఎల్‌, జేకే పేపర్‌, నజారా టెక్నాలజీస్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

ఎన్‌హెచ్‌పీసీ/అదానీ ఇన్‌ఫ్రా/టాటా పవర్‌: ఎన్‌హెచ్‌పీసీ 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్టులు, పవర్‌ ఎవాక్యుయేషన్‌కి కావాల్సిన ట్రాన్స్‌మిషన్‌ లైన్లను అభివృద్ధి చేస్తోంది. అదానీ ఇన్‌ఫ్రా, టాటా పవర్‌, ఎస్‌ఎస్‌ఈఎల్‌-ఏఎస్‌ఆర్‌ జేవీ ఇందులో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.

విప్రో: డిజిటల్‌ వర్క్‌ప్లేస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం స్కానియాతో ఐదేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకొంది.

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: గృహ రుణాలు, తనఖా రుణాలపై రెఫరెన్స్‌ రేట్లను 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. జూన్‌ 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఎల్‌ అండ్‌ టీ: జనవరి- మార్చి త్రైమాసికానికి ఎల్‌ అండ్‌ టీ ఏకీకృత ప్రాతిపదికన రూ.3,620.69 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.3,292.81 కోట్లతో పోలిస్తే ఇది 9.9 శాతం అధికం. ఏకీకృత ఆదాయం కూడా రూ.49,116.16 కోట్ల నుంచి రూ.53,366.26 కోట్లకు పెరిగింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.22ను (1100%) తుది డివిడెండుగా చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

టాటా మోటార్స్‌: మార్చి త్రైమాసికంలో దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఏకీకృత నికర నష్టం రూ.992.05 కోట్లకు పరిమితమైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.7,585.34 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.88,627.90 కోట్ల నుంచి రూ.78,439.06 కోట్లకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని