Stock Market Update: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.....

Published : 20 May 2022 09:39 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అమెరికా మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలతో ముగిశాయి. కానీ, యూఎస్‌ ఫ్యూచర్స్‌ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం సానుకూలంగా కదలాడుతున్నాయి. చైనా ఐదేళ్ల కాలపరిమితి గల లోన్ ప్రైమ్‌ రేటు (LPR)ను 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఇటీవలి లాక్‌డౌన్‌ల కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఈ నిర్ణయం తీసుకొంది. ఇది ఆసియా మార్కెట్లకు సానుకూలంగా మారింది. యూఎస్‌ ఫ్యూచర్స్‌, ఆసియా సూచీల నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 982 పాయింట్ల లాభంతో 53,774.68 వద్ద, నిఫ్టీ (Nifty) 308.15 పాయింట్లు పెరిగి 16,117.55 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.54 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఎన్‌టీపీసీ, అమరరాజా బ్యాటరీస్‌, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఇండిగో పెయింట్స్‌, లక్ష్మీ మిల్స్‌, మైండ్‌టెక్‌ ఇండియా లిమిటెడ్‌, నువోకో విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రాణె మద్రాస్ లిమిటెడ్‌, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు లిమిటెడ్‌.

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ: ఈరోజు కంపెనీ షేర్లు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. ఇష్యూ ధరను రూ.630గా నిర్ణయించారు. షేర్లు 1.22 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. 

డాక్టర్‌ రెడ్డీస్‌: అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,437 కోట్ల ఆదాయాన్ని, రూ.88 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.4,728 కోట్లు, నికరలాభం రూ.362 కోట్లు కావడం గమనార్హం. దీంతో పోలిస్తే ఈసారి ఆదాయం 15 శాతం పెరిగినా, నికరలాభం 76 శాతం క్షీణించింది.

గోద్రెజ్‌ కన్జూమర్‌: ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ గోద్రెజ్‌ కన్జూమర్‌ మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.363.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.365.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.2,730.74 కోట్ల నుంచి రూ.2,915.82 కోట్లకు పెరిగింది.

అశోక్‌ లేలాండ్‌: మార్చి త్రైమాసికానికి రూ.157.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.377.13 కోట్లతో పోలిస్తే ఇది 58.14 శాతం తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.8,142.11 కోట్ల నుంచి రూ.9,926.97 కోట్లకు పెరిగింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1 (100 శాతం) చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. 

హెచ్‌పీసీఎల్: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) మార్చి త్రైమాసికానికి రూ.1,795.26 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.3,017.96 కోట్లతో పోలిస్తే ఇది 40 శాతం తక్కువ. ప్రతి పీపా ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 12.44 డాలర్లను కంపెనీ ఆర్జించిందని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ పుష్ప్‌ కుమార్‌ జోషి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని