Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి...

Updated : 25 May 2022 09:43 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్‌లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. స్నాప్‌షాట్‌ నిన్న ఒక్కరోజే ఏకంగా 43 శాతం కుంగింది. నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి.

నేడు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్న ఇతర అంశాలు..

* డాలర్‌ ఇండెక్స్‌ 102 వద్ద ఒకనెల కనిష్ఠానికి చేరింది. భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లకు ఇది కలిసొచ్చే అంశం.

* ఏడాదికి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనె, మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌ నూనెల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇది ఎఫ్‌ఎంసీజీ కంపెనీల స్టాక్‌లపై ప్రభావం చూపొచ్చు.

* ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్‌ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది షుగర్‌ స్టాక్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

* ఎఫ్‌ఐఐలు నిన్న నికరంగా రూ.2,393.45 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు నికరంగా రూ.1948.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్‌పీఐలు సైతం భారీ ఎత్తున అమ్మకాలను కొనసాగిస్తున్నారు.

* గతకొన్ని రోజులుగా ఐటీ రంగం చాలా బలహీనంగా చలిస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 282.53 పాయింట్ల లాభంతో 54,335 వద్ద, నిఫ్టీ (Nifty) 78 పాయింట్లు లాభపడి 16,203 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.50 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, టైటన్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, దీపక్‌ ఫర్టిలైజర్స్‌, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌, ఈజీట్రిప్‌ ప్లానర్స్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, నాల్కో, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, బాటా ఇండియా, టొరెంట్‌ ఫార్మా

నేడు గమనించాల్సిన స్టాక్‌లు..

బలరాంపూర్‌ చైనీ: గత ఏడాది నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 16.2 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 24.9 శాతం పెరిగి రూ.1,291.37 కోట్లకు పెరిగింది.

బీఓఐ: మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం 142.31 శాతం పెరిగి రూ.606 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,155.53 కోట్ల నుంచి పెరిగి రూ.11,443.46 కోట్లకు చేరింది.

అదానీ పోర్ట్స్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 21.8 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం మాత్రం 8.5 శాతం పెరిగి రూ.4,417.87 కోట్లకు చేరింది.

కోల్‌ ఇండియా: కొత్త గనులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్పత్తిని 12 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని