Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 24 Jun 2022 09:30 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market Update) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మాత్రం నేడు మిశ్రమంగా చలిస్తున్నాయి. వరుస నష్టాల మధ్య మార్కెట్లలో ఉపశమన ర్యాలీ కనిపిస్తోంది. మరోవైపు 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండువారాల కనిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం సూచీలకు కలిసొస్తోంది. దేశీయంగా కమొడిటీ ధరలు కొంత తగ్గుతుండడం కూడా సానుకూలాంశం.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 552 పాయింట్ల లాభంతో 52,818 వద్ద, నిఫ్టీ (Nifty) 165 పాయింట్లు లాభపడి 15,721 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.16 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే నష్టాల్లో చలిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

* హీరో మోటోకార్ప్‌: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ జులై 1 నుంచి మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.3,000 వరకు పెంచబోతున్నట్లు తెలిపింది.

* టాటా మోటార్స్‌: ముంబయిలో నెక్సాన్‌ విద్యుత్‌ మోడల్‌ కారులో మంటలు రేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ గురువారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో టాటా మోటార్స్‌ స్పందించింది.

* టాటా స్టీల్‌: టాటా స్టీల్‌ అనుబంధ సంస్థ అయిన టాటా స్టీల్‌ మైనింగ్‌ రోహిత్‌ ఫెర్రో-టెక్‌లో 10 వాటాల కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది.

* డీసీఎం శ్రీరాం: విండ్‌-సోలార్ హైబ్రిడ్‌ రిన్యూవబుల్‌ పవర్‌ ప్రాజెక్టు నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఎస్‌పీవీలో రూ.65 కోట్లకు 26 శాతం వాటా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని