Stock Market Update: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో  ప్రారంభమయ్యాయి....

Published : 29 Apr 2022 09:31 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో  ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta Earnings) బలమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం అక్కడి సూచీలను ముందుకు నడిపించాయి. అయితే, మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడిన యాపిల్‌ (apple results), అమెజాన్ ఫలితాలు (Amazon Results) మాత్రం నిరాశపర్చాయి. దీంతో యూఎస్‌ ఫ్యూచర్స్‌ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్ల నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర 105 డాలర్లకు చేరింది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 350 పాయింట్ల లాభంతో 57,871 వద్ద, నిఫ్టీ (Nifty) 96 పాయింట్లు లాభపడి 17,341 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.64 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: మారుతీ సుజుకీ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, విప్రో, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌, క్యాన్‌ఫిన్‌ హోమ్స్‌, జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జిల్లెట్‌ ఇండియా, జీఎన్‌ఏ యాక్సిల్స్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, జస్ట్‌ డయల్‌, ఎల్అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, లాయిడ్స్‌ మెటల్స్‌ అండ్‌ ఎనర్జీ, ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌, టాటా కెమికల్స్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

* యాక్సిస్‌ బ్యాంక్‌: జనవరి- మార్చి త్రైమాసికానికి యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.4,117.77 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.2,677.06 కోట్లతో పోలిస్తే ఇది 54 శాతం అధికం.

* లారస్‌ ల్యాబ్స్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన యూనిట్ల విస్తరణ కార్యకలాపాలపై రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. మరో రూ.200 కోట్లు వెచ్చించి ఔషధ పరిశోధన- అభివృద్ధి (ఆర్‌ ఖీ డీ) కేంద్రాన్ని నిర్మించనుంది. అన్ని ఔషధ విభాగాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, అందుకు తగిన విధంగా నిధులు కేటాయిస్తున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావ వెల్లడించారు.

* బయోకాన్‌: మార్చి త్రైమాసికంలో బయోకాన్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.283.90 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.296.40 కోట్లతో పోలిస్తే ఈసారి 4 శాతం తగ్గింది.

* సైయెంట్‌: సింగపూర్‌కు చెందిన గ్రిట్‌ కన్సల్టింగ్‌ అనే సంస్థను రూ.284 కోట్లకు కొనుగోలు చేసినట్లు సైయెంట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది.

* వేదాంతా: జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 5 శాతం తగ్గి రూ.7,261 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.7,629 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.27,874 కోట్ల నుంచి రూ.39,342 కోట్లకు పెరిగింది.

* అంబుజా సిమెంట్స్‌: జనవరి- మార్చి త్రైమాసికానికి అంబుజా సిమెంట్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.856.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.1,228.24 కోట్లతో పోలిస్తే ఈసారి 30.26 శాతం తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని