Stock Market Update: ఆరంభంలోనే భారీ పతనం!

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Updated : 06 May 2022 09:52 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు  గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు సైతం ప్రతికూలంగానే ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లను పెంచడం, దేశీయంగానూ వివిధ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండటం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పిందనడానికి వీటన్నింటినీ మదుపర్లు సంకేతాలుగా భావిస్తున్నారు.

మరోవైపు చమురు ఉత్పత్తిని పెంచేది లేదని ఒపెక్‌ ప్రకటించడం కూడా సూచీల కలవరానికి కారణమైంది. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 110 డాలర్ల వరకు ఎగబాకింది. వీటితో పాటు దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా సెంటిమెంటును దెబ్బతీసింది. ఈరోజు వెలువడనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలపై మదుపర్లు దృష్టి పెట్టనున్నారు. వారాంతపు ప్రభావం కూడా సూచీలపై ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 827 పాయింట్ల నష్టంతో 54,874.76 వద్ద, నిఫ్టీ (Nifty) 262 పాయింట్లు నష్టపోయి 16,420 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.70 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే పయనిస్తున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌కార్ప్‌, విప్రో, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్‌, కెనరా బ్యాంక్‌, సుందరమ్‌ క్లేటన్‌, టాటా పవర్‌ కంపెనీ, సీఎస్‌బీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్‌ కంపెనీ, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, అపోలో పైప్స్‌, అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌, గ్రీన్‌ప్యానెల్‌ ఇండస్ట్రీస్‌, గ్రైండ్‌వెల్‌ నార్టన్‌, హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌, కొకుయో క్యామ్లిన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

ఈ రోజు గమనించాల్సిన స్టాక్‌లు..

టీవీఎస్‌ మోటార్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.275 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదు చేసిన రూ.319 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 14% తక్కువ. మొత్తం ఆదాయం రూ.6,132 కోట్ల నుంచి రూ.6,585 కోట్లకు చేరింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, బీఓబీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును పెంచడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రామాణిక రుణ రేటు (ఐ- ఈబీఎల్‌ఆర్‌)ను 8.10 శాతానికి సవరించింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కూడా 6.9 శాతానికి రుణ రేటును (బీఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) పెంచింది.

అదానీ పవర్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అదానీ పవర్‌ రూ.4,645.47 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.13.13 కోట్ల నికర లాభాన్ని మాత్రమే ప్రకటించింది.

ఎల్‌ అండ్‌ టీ: బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ కోసం భారీ కాంట్రాక్టును తమ నిర్మాణ విభాగం దక్కించుకుందని ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది.

టాటా పవర్‌: టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌కు దేశంలోనే అతిపెద్ద సౌర ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) ఆర్డరు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్‌ నుంచి రూ.5,500 కోట్ల విలువైన 1 గిగావాట్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు లభించినట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని