Stock Market Update: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి....

Published : 29 Jun 2022 09:31 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్య భయాలు మార్కెట్లను ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. అమెరికా కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ తగ్గిందన్న నివేదికలు మంగళవారం అక్కడి మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. అక్కడ గ్యాస్‌, నిత్యావసరాలు, గృహ విక్రయ రంగాలు.. ధరల భారంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి. అగ్రరాజ్య మార్కెట్ల నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. దేశీయంగా చూస్తే రూపాయి బలహీనత, చమురు ధరల పెరుగుదల మార్కెట్లకు ప్రతికూలాంశం.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 500 పాయింట్ల నష్టంతో 52,677 వద్ద, నిఫ్టీ (Nifty) 146 పాయింట్లు నష్టపోయి 15,704 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.95 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

* రిలయన్స్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ బాధ్యతలను ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. ప్రస్తుతం రిలయన్స్‌ జియో బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఆకాశ్‌ ఉన్నారు.

* టాటా మోటార్స్‌: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. వాహనాల ధరలు 1.5-2.5 శాతం పెంచాలనుకుంటున్నట్లు తెలిపింది.

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కార్పొరేట్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ బిజినెస్‌ను రెండు భాగాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు మిడ్‌ కార్పొరేట్‌ స్థాయి సంస్థల కోసం ప్రత్యేకంగా 27 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

* జమ్మూ కశ్మీర్‌ బ్యాంక్‌: ఈ బ్యాంకు 2022-23లో ఈక్విటీ, డెట్‌ మార్గాల ద్వారా రూ.2000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని