Stock Market Update: ఊగిసలాటలో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 10 May 2022 09:45 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలకు ఉదయం కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే, కాసేపటికే అమ్మకాల సెగ తగలడంతో స్వల్ప లాభాలు కాస్తా ఆవిరయ్యాయి. ఆ తర్వాత తిరిగి కోలుకొని లాభాల్లోకి ఎగబాకాయి. ఇలా ఆరంభంలో మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో పయనిస్తుండడం గమనార్హం. అయితే కనిష్ఠాల వద్ద కొనుగోలు వ్యూహాన్ని మదుపర్లు అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీరేట్ల పెంపు ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల వృద్ధి దెబ్బతిననుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. మరోవైపు క్రిప్టోకరెన్సీలు ఈక్విటీ మార్కెట్లను అనుసరిస్తున్నాయి. బిట్‌కాయిన్‌ విలువ 22 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఈ పరిణామాలే మార్కెట్ల పతనానికి కారణమవుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 98 పాయింట్ల లాభంతో 54,569.38 వద్ద, నిఫ్టీ (Nifty) 25 పాయింట్లు లాభపడి 16,327 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.23 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, వొడాఫోన్‌ ఐడియా, గుజరాత్‌ గ్యాస్‌, అజంతా ఫార్మా, సెరా శానిటరీవేర్‌, చాలెట్‌ హోటల్స్‌, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌, డిష్‌మ్యాన్‌ కార్బోజెన్‌ అమ్‌సిస్‌, ఎలాన్‌టస్‌ బెక్‌ ఇండియా, ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మహానగర్‌ గ్యాస్‌, ఎంఆర్‌ఎఫ్‌, పాలీక్యాబ్‌ ఇండియా, న్యూలాండ్‌ లేబోరేటరీస్‌, ఓరియెంట్‌ ఎలక్ట్రిక్‌, రిలయన్స్ క్యాపిటల్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

బ్యాంకింగ్‌ స్టాక్‌లు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కరూర్‌ వైశ్య బ్యాంక్‌ సహా మరికొన్ని బ్యాంకులు రెపోరేటుకు అనుగుణంగా వడ్డీరేట్లను సవరించనున్నట్లు సోమవారం ప్రకటించాయి.

హెచ్‌సీఎల్‌ టెక్‌: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న క్వెస్ట్‌ ఇన్ఫర్మేటిక్స్‌ను రూ.15 కోట్లతో సొంతం చేసుకోనుంది.

వేదాంత్‌ ఫ్యాషన్స్‌: గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగి రూ.87.40 కోట్లకు చేరింది.

టాటా పవర్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా పవర్‌ ఏకీకృత నికర లాభం 31శాతం పెరిగి రూ.632.37 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతం ఎగబాకి రూ.12,085గా రికార్డయ్యింది.

పీవీఆర్‌: జనవరి-మార్చిలో పీవీఆర్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.105.49 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.289.21 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.181.46 కోట్ల నుంచి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.537.14 కోట్లకు చేరింది.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా: నాగ్‌పుర్‌ విమానాశ్రయ నిర్వహణ హక్కులను జీఎంఆర్‌ గ్రూప్‌ సొంతం చేసుకుంది. నాగ్‌పుర్‌ ఎయిర్‌పోర్ట్‌కు జరిగిన బిడ్డింగ్‌ ప్రక్రియను రద్దు చేసేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించగా.. వీటిపై మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాల సంయుక్త సంస్థ మిహాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్థించడంతో విమానాశ్రయ నిర్వహణ జీఎంఆర్‌ దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని