Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 18,250 ఎగువన నిఫ్టీ

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 311 పాయింట్ల లాభంతో 61,872 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 87 పాయింట్లు లాభపడి 18,269 దగ్గర కొనసాగుతోంది.

Published : 18 May 2023 09:40 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 311 పాయింట్ల లాభంతో 61,872 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 87 పాయింట్లు లాభపడి 18,269 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.35 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అప్పుల పరిమితి పెంపు విషయంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలు అక్కడి సూచీల్లో సానుకూలతలు నింపాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉంది. మరోవైపు సూచీల్లో ప్రాధాన్య వెయిటేజీ ఉన్న ఐటీసీ, ఎస్‌బీఐ మార్చి త్రైమాసిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. మరోవైపు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఎఫ్‌ఐఐలు రూ.149 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.208 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

ఎస్‌బీఐ/ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 9.9 శాతం ఓటింగ్‌ రైట్స్‌ లేదా పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐకి ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీన్ని 2023 నవంబరు 15 నాటికి పూర్తి చేయాలని ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌కు ఆర్‌బీఐ సూచించింది.

వేదాంత: 2023- 24 ఆర్థిక సంవత్సరానికిగానూ తొలి మధ్యంతర డివిడెండ్‌పై వేదాంత బోర్డు మే 22న భేటీ కానుంది. ఒకవేళ డివిడెండ్‌కు ఆమోదం లభిస్తే రికార్డు తేదీ మే 30గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: మహారాష్ట్ర గడ్చిరోలిలోని సూరజ్‌గడ్‌ 4 ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ కాంపోజిట్‌ లైసెన్స్‌ను పొందడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది.

సూర్య రోష్ని: ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఐఓసీ, మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌ నుంచి సూర్య రోష్నికి రూ.62.23 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించింది.

వేదాంత్‌ ఫ్యాషన్స్‌: ప్రమోటర్‌ రవి మోదీ ఫ్యామిలీ 9.88 శాతం వాటాలను విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మే 18, 19న ఇది జరగనుంది. ఒక్కో షేరు విలువను రూ.1,161గా నిర్ణయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని