Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 18,250 పైకి నిఫ్టీ

Stock Market:  ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర కొనసాగుతోంది.

Published : 22 May 2023 09:39 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ, కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే  పుంజుకుంటున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.79 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. డెట్‌ సీలింగ్ పరిమితి పెంపుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగడం అక్కడి మదుపర్లను కలవరపెడుతోంది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల గడువు ఈ వారమే ముగియనుంది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియనూ మార్కెట్లు సునిశితంగా పరిశీలించొచ్చు. నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా రుణ పరిమితి ఒప్పందంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై ఆధారపడి, సమీప కాలంలో మార్కెట్లు కదలాడొచ్చని నిపుణులు అంటున్నారు. విదేశీ మదుపర్లు శుక్రవారం రూ.113.46 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.1,071 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

దివీస్‌ లేబొరేటరీస్‌: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.1,974 కోట్ల ఆదాయాన్ని, రూ.319 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.2,546 కోట్లు, నికరలాభం రూ.883 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోలిస్తే ఈసారి ఆదాయం, లాభం బాగా తక్కువగా నమోదయ్యాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: జనవరి- మార్చి త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 11.90 శాతం పెరిగి రూ.3,741 కోట్లకు చేరింది. అధిక ఆదాయం ఇందుకు కలిసొచ్చింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.3,343 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.47,128 కోట్ల నుంచి రూ.47,427 కోట్లకు పెరిగింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: మార్చి త్రైమాసికంలో  రూ.1,159 కోట్ల నికరలాభాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక స్టాండలోన్‌ నికరలాభం రూ.202 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 5 రెట్ల కంటే అధికం. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడం ఇందుకు కారణం. ఇదే సమయంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,095 కోట్ల నుంచి రూ.27,269 కోట్లకు పెరిగింది.

బంధన్‌ బ్యాంక్‌: మార్చి త్రైమాసికంలో బంధన్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 58 శాతం క్షీణించి రూ.808 కోట్లకు పరిమితమైంది. అధిక కేటాయింపులు ఇందుకు కారణమయ్యాయి. 2021-22 ఇదే మూడు నెలల్లో బ్యాంకు లాభం రూ.1,902 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.4,844 కోట్ల నుంచి రూ.4,897.38 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని