Stock Market: భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 17,400 దిగువకు నిఫ్టీ

Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 723 పాయింట్ల నష్టంతో 59,082 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 203 పాయింట్లు నష్టపోయి 17,386 దగ్గర కొనసాగుతోంది.

Updated : 10 Mar 2023 09:30 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 723 పాయింట్ల నష్టంతో 59,082 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 203 పాయింట్లు నష్టపోయి 17,386 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.07 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఒత్తిడి కనిపించింది. మరోవైపు వడ్డీరేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో రుణ ఎగవేతలు పెరగొచ్చనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యూఎస్‌లో మార్చి నెలలో నిరుద్యోగ క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా సూచీలు నష్టాలు చవిచూశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లూ ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: 50 ఏళ్ల కిత్రం నాటి ప్రసిద్ధ పానీయ బ్రాండు ‘కాంపా కోలా’ను సరికొత్త రూపంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ మళ్లీ విపణిలోకి విడుదల చేసింది. మరోవైపు శుభలక్ష్మి పాలిస్టర్స్‌, శుభలక్ష్మి పాలీటెక్స్‌ వ్యాపారాల కొనుగోలు ప్రక్రియను రిలయన్స్‌ పాలిస్టర్‌ పూర్తి చేసింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: అనుబంధ సంస్థ బీఓబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌లో తమ 49 శాతం వాటాను ఉపసంహరించుకోవడానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోర్డు ఆమోదం తెలిపింది.

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌: డోమినోస్‌ ఇండియాలో అధ్యక్షుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సమీర్‌ బాత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం మార్చి 9, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. డోమినోస్‌ ఇండియాకు జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ మాస్టర్‌ ఫ్రాంచైజీగా ఉంది.

ఆర్‌ఈసీ: 2023- 24 ఆర్థిక సంవత్సరానికిగానూ వివిధ డెట్‌ సాధనాల ద్వారా రూ.1.2 లక్షల కోట్ల సమీకరణకు ఆర్‌ఈసీ బోర్డు ఆమోదం తెలిపింది.

విప్రో: ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సేవల సంస్థ మెంజీస్‌ ఏవియేషన్‌కు చెందిన ఎయిర్‌ కార్గో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ రూపాంతరానికి సంబంధించిన ప్రాజెక్టును చేపట్టడానికి విప్రో ఎన్నికైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని