Stock Market: భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 60,000 ఎగువకు సెన్సెక్స్‌

Stock Market: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 525 పాయింట్ల లాభంతో 60,334 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 146 పాయింట్లు లాభపడి 17,740 దగ్గర కొనసాగుతోంది.

Published : 06 Mar 2023 09:29 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 525 పాయింట్ల లాభంతో 60,334 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 146 పాయింట్లు లాభపడి 17,740 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.79గా ఉంది. సెన్సెక్స్‌30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు గతవారాన్ని లాభాలతో ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్‌ (Adani Group)లోకి జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ద్వారా పెట్టుబడులు రావడం సానుకూలతలను తెచ్చిపెట్టిందని.. రిటైల్‌ మదుపర్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత శుక్రవారం రూ.246.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు సైతం రూ.2,089.92 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. హోలీ సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఈవారం ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం కానుంది.

గమనించాల్సిన స్టాక్స్‌..

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌: ఈ సంస్థ అనుబంధ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ప్రాపర్టీ వెంచర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ వెంచర్‌ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.

అశోకా బిల్డ్‌కాన్‌/మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌: యునిసన్‌ ఎన్విరో ప్రైవేట్‌లో అశోకా బిల్డ్‌కాన్‌ తమ 100 శాతం వాటాను మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ రూ.531 కోట్లు.

ఎక్సైజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌: క్లోరైడ్‌ పవర్‌ సిస్టమ్స్‌ అండ్ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను మాతృసంస్థ ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రెండు ప్రాజెక్టుల విస్తరణకు పవర్‌గ్రిడ్‌ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది.

ఈజీట్రిప్ ప్లానర్స్‌ లిమిటెడ్‌: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని