Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 247 పాయింట్ల నష్టంతో 61,656 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 69 పాయింట్లు నష్టపోయి 18,227 దగ్గర కొనసాగుతోంది.

Published : 12 May 2023 09:42 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 247 పాయింట్ల నష్టంతో 61,656 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 69 పాయింట్లు కుంగి 18,227 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.1 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, మారుతీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగ క్లెయింలు పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మరోవైపు జూన్‌ 1తో గడువు తీరనున్న రుణాల చెల్లింపులపై అమెరికాలో సందిగ్ధత నెలకొంది. ఇది మాంద్యానికి దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు మార్కెట్లను కలవరపెట్టాయి. ఇదే కారణంతో బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర గురువారం 1.56 శాతం తగ్గి 75.22 డాలర్లకు చేరింది. మరోవైపు వరుసగా 11వ రోజైన గురువారమూ విదేశీ మదుపర్లు భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. నిన్న రూ.837.21 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.200.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇండెక్స్‌ ప్రొవైడర్‌ ఎంఎస్‌సీఐ మే సమీక్షలో భాగంగా కొత్త షేర్లను ‘ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇండెక్స్‌’లో చేర్చింది. వీటిలో భారత్‌కు చెందిన హెచ్‌ఏఎల్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ ఉన్నాయి. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ను స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సూచీ నుంచి మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ సూచీలో జత చేశారు. 2023 జూన్‌ 1 నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

ఐషర్‌ మోటార్స్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.906 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.610 కోట్లతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో విక్రయాలు పుంజుకోవడమే ఇందుకు కారణం. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.3,193 కోట్ల నుంచిరూ.3,804 కోట్లకు పెరిగింది.

ఏషియన్‌ పెయింట్స్‌: మార్చి త్రైమాసికంలో ఏషియన్‌ పెయింట్స్‌ రూ.1,258.41 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.874.05 కోట్లతో పోలిస్తే ఇది 43.97 శాతం అధికం. మొత్తం ఆదాయం 11.53% పెరిగి రూ.8,892.82 కోట్లకు చేరింది. రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు రూ.21.25 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

న్యూలాండ్‌ లేబొరేటరీస్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.415 కోట్ల ఆదాయం, రూ.84.5 కోట్ల నికరలాభం ఆర్జించింది.

ఓఎన్‌జీసీ: అరేబియా సముద్రని అమృత్‌, మూంగా బ్లాక్స్‌లో కొత్త గ్యాస్‌, సహజవాయువు రిజర్వ్‌లను కనుగొన్నట్లు ఓఎన్‌జీసీ ప్రకటించింది.

ఎన్‌బీసీసీ ఇండియా: ఏప్రిల్‌లో ఎన్‌బీసీసీ ఇండియా రూ.1,264 కోట్లు విలువ చేసే ఆర్డర్లను దక్కించుకుంది.

మరోవైపు ఈరోజు ఫలితాలు ప్రకటించిన టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌ఏఎల్‌, సిప్లా, పాలీక్యాబ్‌ ఇండియా, ఇంద్రప్రస్త గ్యాస్‌, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, గ్రీవ్స్‌ కాటన్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు