Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 17,100 దిగువకు నిఫ్టీ

Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 275 పాయింట్ల నష్టంతో 57,939 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 80 పాయింట్లు నష్టపోయి 17,071 దగ్గర కొనసాగుతోంది.

Updated : 23 Mar 2023 09:35 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 275 పాయింట్ల నష్టంతో 57,939 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 80 పాయింట్లు నష్టపోయి 17,071 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని 82.37 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటును మరో 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) పెంచింది. ఇటీవలి పరిణామాలు గృహ, కార్పొరేట్లకు కఠిన రుణ పరిస్థితులు తీసుకురావొచ్చని ఫెడ్‌ అంచనా వేసింది. బ్యాంకింగ్‌ రంగంలోని అనిశ్చితి నేపథ్యంలోనూ వడ్డీరేట్లు పెంచడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు నష్టాల్లో చలిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర 1 శాతం తగ్గి 75.89 డాలర్లకు చేరింది. మరోవైపు ఈరోజు వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ కూడా ఉన్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది.

గమనించాల్సిన స్టాక్స్‌..

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL): హెచ్‌ఏఎల్‌లో 3.5% వరకు వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో జరిగే ఈ విక్రయానికి, ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.2,450ను నిర్ణయించారు. షేర్లకు పూర్తి స్థాయిలో స్పందన లభిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.2,800 కోట్లు వరకు సమకూరొచ్చు.

కిమ్స్‌: పోలార్‌ కేపిటల్‌ ఫండ్స్‌, అనే సంస్థ బుధవారం స్టాక్‌మార్కెట్లో రూ.144 కోట్ల విలువైన కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) షేర్లను విక్రయించింది. షేరు రూ.1300 చొప్పున 11,05,934 షేర్లను బల్క్‌ డీల్స్‌ విభాగంలో ఈ సంస్థ విక్రయించినట్లు తెలుస్తోంది.

హీరో మోటోకార్ప్‌: తన వాహన మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, వాహన తయారీలో చేసిన మార్పుల వల్ల, వ్యయాలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

లార్సెన్‌ అండ్‌ టుబ్రో: ఫ్రాన్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న McPhy Energyతో ఎల్అండ్‌టీ దీర్ఘకాల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొంది. ప్రెజరైజ్డ్‌ ఆల్కలీన్‌ ఎలక్ట్రోలైజర్‌ తయారీకి ఎల్‌అండ్‌టీకి McPhy Energy లైసెన్స్‌ ఇవ్వనుంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌.. పర్సనల్‌ అండ్‌ హోమ్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను లాంఛ్‌ చేసింది.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌: ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ నుంచి ఆరు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ను పవర్‌ గ్రిడ్‌ కొనుగోలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు