Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల నష్టంతో 62,544 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 17 పాయింట్లు నష్టపోయి 18,517 దగ్గర కొనసాగుతోంది.

Updated : 01 Jun 2023 09:50 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అప్పుల పరిమితి బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలపడం ఆరంభంలో సూచీలకు మద్దతుగా నిలిచింది. కొద్దిసేపటికే సూచీలు మళ్లీ కుంగాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల నష్టంతో 62,544 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 17 పాయింట్లు నష్టపోయి 18,517 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు పుంజుకొని 82.47 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అప్పుల పరిమితి బిల్లు ఓటింగ్‌ నేపథ్యంలో అక్కడి మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి. అప్పుల పరిమితి పెంపు బిల్లు యూఎస్‌ మార్కెట్లు ముగిసిన తర్వాత హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదం పొందింది. సెనేట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా- పసిఫిక్‌ సూచీలు బలంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు చైనాలో మే నెలలో తయారీ కార్యకలాపాలు 11 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. 2022-23 జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1% వృద్ధి చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 శాతానికి చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.3,406 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,529 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఏబీఆర్‌డీఎన్‌ (మారిషస్‌ హోల్డింగ్స్‌) 2006 లిమిటెడ్‌ తమ వాటాలన్నింటినీ విక్రయించింది.

అదానీ గ్రూప్‌ షేర్లు: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తన 3 కంపెనీల్లో ఈక్విటీ షేర్లను సంస్థాగత మదుపర్లకు విక్రయించడం ద్వారా 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) వరకు సమీకరించాలని భావిస్తోంది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిన వెలువడ్డ అనంతరం, నిధుల సమీకరణకు గ్రూప్‌ వేస్తున్న వ్యూహాత్మక అడుగు ఇదే.

లారస్‌ ల్యాబ్స్‌: సెల్‌, జీన్‌ థెరపీ ఉత్పత్తుల సంస్థ ఇమ్యునోఅడాప్టివ్‌ సెల్‌ థెరపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇమ్యునోయాక్ట్‌) లో, లారస్‌ ల్యాబ్స్‌ తన వాటా పెంచుకుంటోంది. ఇప్పటికే దాదాపు 26% వాటా కలిగిన లారస్‌ ల్యాబ్స్‌, మరో 7.24% వాటాను రూ.80 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇమ్యునోయాక్ట్‌లో లారస్‌ ల్యాబ్స్‌ వాటా 33.86 శాతానికి పెరుగుతుంది.

కోల్‌ ఇండియా: కోల్‌ ఇండియాలో ప్రభుత్వం 3% వరకు వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో నేటి నుంచి విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.225ను నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని