Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 17,000 పైన నిఫ్టీ

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 166 పాయింట్ల లాభంతో 57,795 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్లు లాభపడి 17,034 దగ్గర కొనసాగుతోంది.

Published : 21 Mar 2023 09:38 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 166 పాయింట్ల లాభంతో 57,795 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్లు లాభపడి 17,034 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 82.54 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు జరుగుతున్న పరిణామాలు మదుపర్లలో ఒకింత విశ్వాసం నింపాయి. మరోవైపు వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్‌ పాయింట్లు ఉండొచ్చనే వార్తల్ని మార్కెట్లు క్రమంగా ఆకళింపు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేడు ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇటీవల 15 నెలల కనిష్ఠానికి చేరిన ముడి చమురు ధరలు సోమవారం కాస్త పుంజుకున్నాయి. బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 73.79 డాలర్లకు చేరింది.

గమనించాల్సిన స్టాక్స్‌..

అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఆర్థిక సంస్థలతో రుణ ఒప్పందాలు ఇంకా కుదరనందునే, గుజరాత్‌లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలనుకున్న పెట్రోకెమ్‌ ప్రాజెక్టు పనులను నిలిపి వేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సోమవారం స్పష్టత ఇచ్చింది.

ఇండియన్‌ ఆయిల్‌, ఎన్‌టీపీసీ: ఐఓసీఎల్‌కు చెందిన కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీతో కలిసి ఐఓసీఎల్‌ జాయింట్‌ వెంచర్ ఏర్పాటు చేయనుంది. దీని నుంచి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నెలకొల్పనున్నాయి.

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ: రాన్‌ ఆఫ్‌ కచ్‌లోని క్వాడా ఆర్‌ఈ పవర్‌ పార్క్‌లో ఎన్‌టీపీసీ రిన్యూవబుల్‌ ఎనర్జీ 1200 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ పీవీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీంట్లో 300 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు బ్లాక్‌లను చేపట్టడానికి స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ఎనర్జీ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది.

కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌: రూ.1 లక్ష ముఖ విలువ కలిగిన 30,000 మార్పిడిరహిత డిబెంచర్లను జారీ చేసేందుకు కొటాక్‌ మహీంద్రా సిద్ధమైంది. తద్వారా రూ.300 కోట్లు సమీకరించనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు