Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 18,350 పైన నిఫ్టీ

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 116 పాయింట్ల లాభంతో 62,079 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 50 పాయింట్లు లాభపడి 18,365 దగ్గర కొనసాగుతోంది.

Published : 23 May 2023 09:30 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 116 పాయింట్ల లాభంతో 62,079 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 50 పాయింట్లు లాభపడి 18,365 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.82 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఒక్క కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. అప్పుల పరిమితి పెంపుపై నెలకొన్న సందిగ్ధత ఇంకా మార్కెట్లను కలవరపెడుతూనే ఉంది. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 0.6 శాతం పెరిగింది. విదేశీ మదుపర్లు సోమవారం రూ.923 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.604 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. ఈ కేలండర్‌ ఏడాదిలో ఐటీ షేర్లలో వచ్చిన దిద్దుబాటును మ్యూచువల్‌ ఫండ్లు అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు రూ.9,500 కోట్లు ఐటీ షేర్ల కొనుగోలుకు వెచ్చించాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీబజార్‌): మార్చితో ముగిసిన త్రైమాసికంలో పీబీ ఫిన్‌టెక్‌ రూ.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.200 కోట్లుగా నమోదైంది.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌: 2022-23 మార్చి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ రూ.194.54 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.31.90 కోట్ల నికరలాభాన్ని సంస్థ ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,282.83 కోట్ల నుంచి రూ.2,879.73 కోట్లకు పెరిగింది.

బీపీసీఎల్‌: మార్చి త్రైమాసికంలో బీపీసీఎల్‌ రూ.6,780 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2,559 కోట్లతో పోలిస్తే ఇది 168% ఎక్కువ. ఇంధన మార్కెటింగ్‌ మార్జిన్లు కోలుకోవడం, మెరుగైన రిఫైనింగ్‌ మార్జిన్‌లు ఇందుకు కలిసొచ్చాయి. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1.23 లక్షల కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.1.33 లక్షల కోట్లకు చేరింది.

వేదాంత: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి మధ్యంతర డివిడెండ్‌ను వేదాంత బోర్డు ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ.18.50 డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు రూ.6,877 కోట్లు వెచ్చించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని