Published : 04 Jul 2022 09:41 IST

Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మరికాసేపట్లోనే తిరిగి కోలుకొని ఫ్లాట్‌గా చలిస్తున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గతవారం మొత్తంగా చూస్తే నష్టాలు మూటగట్టుకున్నాయి. నేడు అక్కడి మార్కెట్లకు సెలవు. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ ఒత్తిడిలో చలిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లను ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయి. దేశీయంగా చూస్తే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు; కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడం; మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయంటూ అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ సంకేతాలు ఇవ్వడం.. వంటి పరిణామాలు సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీలు ప్రకటించనుండటంతో మదుపర్లు ఆ దిశగానూ దృష్టి సారించే అవకాశం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 98 పాయింట్ల నష్టంతో 52,809 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 15,715 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.02 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, మారుతీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో): ఆకాశ, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపడుతున్న తరుణంలో ఇండిగో సిబ్బంది ఒక్కసారిగా సగానికి పైగా మంది సెలవుపై వెళ్లారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను; చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్‌ పన్ను విధించడంతో శుక్రవారం రిలయన్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా పడిపోయింది. దీంతో తిరిగి షేర్లకు మద్దతుగా నిలిచే క్రమంలో టెలికాం, రిటైల్‌ విభాగాల లిస్టింగ్‌ వంటి భారీ ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సంస్థాగత మదుపర్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐటీ స్టాక్స్‌: అమెరికా, ఐరోపాలో ఆర్థిక మాంద్యం భయాలు ఊపందుకుంటుండడం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో భారత ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, యాజమాన్యాల ప్రకటనలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ: బ్యాంకింగ్‌ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రతిపాదనకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అనుమతి ఇచ్చాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి ఇందుకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలకు ఈనెల 2వ తేదీతో లభించాయి.

బిర్లాసాఫ్ట్‌: రూ.390 కోట్ల బైబ్యాక్‌కు కంపెనీ జులై 15ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దాదాపు 78 లక్షల షేర్లు రూ.500 చొప్పున కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.

భారత్‌ ఫోర్జ్‌: అనుబంధ సంస్థ బీఎఫ్‌ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌తో కలిసి కోయంబత్తూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న జేఎస్‌ ఆటోకాస్ట్‌ ఫౌండ్రీ ఇండియా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని