Stock Market: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 41 పాయింట్ల నష్టంతో 61,891 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 8 పాయింట్లు స్వల్ప నష్టంతో 18,277 దగ్గర కొనసాగుతోంది. 

Updated : 17 May 2023 09:40 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 41 పాయింట్ల నష్టంతో 61,891 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,277 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పతనమై 82.30 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. డెట్‌ సీలింగ్‌ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. దీనిపై సయోధ్య కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జూన్‌ 1 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికా డెట్‌ డిఫాల్ట్‌గా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. విదేశీ మదుపర్లు రూ.1,406.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.886.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

భారత్‌ పెట్రోలియం: ఎథిలీన్‌ క్రాకర్‌ ప్రాజెక్టును భారత్‌ పెట్రోలియం మధ్యప్రదేశ్‌లోని బినా రిఫైనరీలో ఏర్పాటు చేయనుంది. దీని కోసం మూలధన వ్యయం కింద రూ.49,000 కోట్లు  కేటాయించనుంది.

వన్‌ 97 కమ్యూనికేషన్స్‌: పేటీఎం పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ భవీష్‌ గుప్తాను అధ్యక్షుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించింది.

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీ సంయుక్త సంస్థ జియో-బీపీ మంగళవారం అడిటివ్‌ కలిగిన ఉన్నత శ్రేణి డీజిల్‌ను తీసుకొచ్చింది. మెరుగైన మైలేజీ అందించే ఈ డీజిల్‌తో ఏడాదికి ట్రక్కుపై రూ.1.1 లక్షల వరకు ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయించే డీజిల్‌తో పోలిస్తే రూ.1 తక్కువకే దీని రేట్లను కంపెనీ నిర్ణయించింది.

ఎయిర్‌టెల్‌: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,005.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.2,007.80 కోట్లతో పోలిస్తే ఇది 49.2% అధికం. ఏకీకృత ఆదాయం రూ.31,500.30 కోట్ల నుంచి 14.31% పెరిగి రూ.36,009 కోట్లకు చేరింది.

ఐఓసీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మార్చి త్రైమాసికంలో రూ.10,058.69 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.6,021.88 కోట్లతో పోలిస్తే ఇది 67 శాతం అధికం. నాలుగో త్రైమాసికంలో ఇంధన మార్కెటింగ్‌ మార్జిన్లలో రికవరీ, మంచి రిఫైనింగ్‌ మార్జిన్లతో నికర లాభం బాగా పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,778.77 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.18,174 కోట్ల నుంచి రూ.25,857 కోట్లకు చేరింది.

నాట్కో ఫార్మా: ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ముగిసినట్లు నాట్కో ఫార్మా ప్రకటించింది. బైబ్యాక్‌ ప్రక్రియ చేపట్టాలని నాట్కో ఫార్మా డైరెక్టర్ల బోర్డు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో నిర్ణయించిన విషయం విదితమే. ఒక్కో షేర్‌ను రూ.700 ధర కంటే మించకుండా స్టాక్‌మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. దీనికి రూ.210 కోట్లు కేటాయించారు. అనంతరం బైబ్యాక్‌ ప్రక్రియ మార్చి 21 నుంచి ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీ నాటికి 34,47,295 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌కు సగటున రూ.609.17 ధర చెల్లించారు.

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి చేసే సంస్థ అయిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.522.48 కోట్ల ఆదాయాన్ని, రూ.85.29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.379.47 కోట్లు, నికర లాభం  రూ.52.69 కోట్లు ఉన్నాయి.

గ్రాన్యూల్స్‌ ఇండియా: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.1,195 కోట్ల ఆదాయాన్ని, రూ.119 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,030 కోట్లు, నికరలాభం రూ.111 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో ఆదాయం 16%, నికరలాభం 8% పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు