Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 17,200 దిశగా నిఫ్టీ

Stock Market: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 239 పాయింట్ల లాభంతో 58,314 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 74 పాయింట్లు లాభపడి 17,182 దగ్గర కొనసాగుతోంది.

Published : 22 Mar 2023 09:34 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 239 పాయింట్ల లాభంతో 58,314 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 74 పాయింట్లు లాభపడి 17,182 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగానే ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఏవైనా చిన్న సంస్థలు విఫలమై ఆర్థిక స్థిరత్వానికి అనిశ్చితి తెస్తే, అదనపు సహాయ చర్యలు అవసరం అవుతాయని అన్నారు. డిపాజిటర్లు ఎవరూ నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకొని ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే, ఈ రోజు రాత్రి ఫెడ్‌ నుంచి వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.1,454 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. 

గమనించాల్సిన స్టాక్స్‌..

టాటా మోటార్స్‌: ఏప్రిల్‌ 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 5% వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీలో మార్పులు చేయాల్సిన నేపథ్యంలో, వాహన ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది.

టాటా పవర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 200 మెగావాట్ల సోలార్‌ పీవీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ నుంచి టాటా పవర్‌ అనుబంధ సంస్థ టాటా పవర్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీకి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ లభించింది.

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల, స్వల్పకాల రుణాలతో పాటు కమర్షియల్ పేపర్ల ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించడానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

హిందూస్థాన్‌ జింక్‌: ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో షేరుపై రూ.26 మధ్యంతర డివిడెండ్‌ను హిందూస్థాన్‌ జింక్‌ ప్రకటించింది. ఈ ఏడాది డివిడెండ్‌ను ప్రకటించడం ఇది నాలుగోసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని