Stock Market Opening bell: స్తబ్ధుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని స్తబ్ధుగా ప్రారంభించాయి...

Updated : 08 Aug 2022 09:49 IST

ముంబయి: గత మూడు వారాల్లో గణనీయంగా కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని స్తబ్ధుగా ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సూచీలు తర్వాత కాస్త కోలుకొని ఫ్లాట్‌గా చలిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ఉదయం సెషన్‌లో ప్రభావం చూపుతున్నాయి. అయితే, దేశీయంగా సానుకూల పరిణామాలు ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు లాభాల మద్దతు దొరికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్ల సెంటిమెంటును పెంచే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ఉదయం 9:26 గంటల సమయానికి సెన్సెక్స్‌ 43 పాయింట్ల లాభంతో 58,431 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 17,407 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.46 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, మారుతీ, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌, పవర్‌ గ్రిడ్‌, డెలివరీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, వేదాంత్‌ ఫ్యాషన్స్‌, టొరెంట్‌ పవర్‌, వల్‌పూల్‌ ఇండియా, నాల్కో, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, అవంతీ ఫీడ్స్‌, బోరోసిల్‌, కల్యాణి స్టీల్స్‌

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

ఎస్‌బీఐ: జూన్‌ త్రైమాసికంలోఎస్‌బీఐ నికర లాభం 6.7 శాతం మేర తగ్గడంతో రూ.6,068 కోట్లకు పరిమితమైంది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.6,504 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ.77,347.17 కోట్ల నుంచి రూ.74,998.57 కోట్లకు తగ్గింది.

టైటన్‌: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో టైటన్‌ రూ.790 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.18 కోట్లతో పోలిస్తే ఇది పలు రెట్లు అధికం. పండగల సీజన్‌ రాకతో గిరాకీ పెరగడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్ల నుంచి రూ.9,487 కోట్లకు చేరింది.

ఎన్‌ఎండీసీ: ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ, ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.4,913 కోట్ల ఆదాయాన్ని, రూ.1,467 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,656 కోట్లు, నికరలాభం రూ.3,191 కోట్లు ఉన్నాయి.

వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం): ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం మిశ్రమ త్రైమాసిక ఫ‌లితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 88.5 శాతం పెరిగి రూ. 1,679.6 కోట్లకు చేరుకున్నా నిక‌ర న‌ష్టం పెరిగింది. గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.380.2 కోట్ల న‌ష్టంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం జూన్ త్రైమాసికంలో నిక‌ర న‌ష్టం రూ.644.4 కోట్లకు పెరిగింద‌ని పేటీఎం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని