Stock market: తాజా గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ

రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠ స్థాయికి చేరడంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల కోతను ప్రారంభిస్తుందనే ఆశలు పెరిగాయి.

Published : 14 Jun 2024 02:16 IST

మదుపర్ల సంపద రూ.432 లక్షల కోట్లకు
సమీక్ష

రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠ స్థాయికి చేరడంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల కోతను ప్రారంభిస్తుందనే ఆశలు పెరిగాయి. దీనికితోడు యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులు, పరిశ్రమల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.54 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.71% నష్టంతో 82.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

 మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 2 రోజుల్లో రూ.4.72 లక్షల కోట్లు పెరిగి, జీవనకాల గరిష్ఠమైన రూ.431.67 లక్షల కోట్ల (దాదాపు 5.17 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 

సెన్సెక్స్‌ ఉదయం 77,102.05 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 77,145.46 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలతో 204.33 పాయింట్ల లాభంతో 76,810.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 75.95 పాయింట్లు పెరిగి 23,398.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,481.05 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

  •  సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 రాణించాయి. ఎం అండ్‌ ఎం 2.73%, టైటన్‌ 2.68%, ఎల్‌ అండ్‌ టీ 2.06%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.59%, టెక్‌ మహీంద్రా 1.44%, అల్ట్రాటెక్‌ 1.25%, టీసీఎస్‌ 1.18%, విప్రో 1.15%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1% పెరిగాయి. హెచ్‌యూఎల్‌ 1.64%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.10%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.10%, పవర్‌గ్రిడ్‌ 0.99%, ఎయిర్‌టెల్‌ 0.91% నష్టపోయాయి. 
  • భారత్‌లో తమ వాలెట్‌తో ప్రయాణ, వినోద సేవలను సమీకృతం చేసేందుకు పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌తో శామ్‌సంగ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
  • పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (పీఎఫ్‌ఎస్‌) ఛైర్మన్, పీటీసీ ఇండియా సీఎండీ పదవుల్లో ఉన్న రాజీబ్‌ కుమార్‌ మిశ్రాను తొలగించారు. నమోదిత కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించకుండా ఆయనపై సెబీ ఆరు నెలల నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు కంపెనీలు తెలిపాయి. ఆయనపై రూ.10 లక్షల జరిమానాను కూడా సెబీ విధించింది.
  • జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ షేర్ల డీలిస్టింగ్‌: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా దేవాంగ్‌ ప్రవీణ్‌ పటేల్‌ నియమితులయ్యారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి తమ షేర్లను డీలిస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. జూన్‌ 21ను ఇందుకు రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ రోజుకు కంపెనీ షేర్లు కలిగిన వాటాదార్లకు, షేర్ల విలువను తిరిగి చెల్లిస్తారు.
  • ఓఎన్‌జీసీ నుంచి ‘భారీ’ ఆర్డరు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. కంపెనీ రూ.2500-5000 కోట్ల విలువైన వాటిని భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుంది.
  • మదుపర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును రికవరీ చేసేందుకు జులై 16న కేబీసీఎల్‌ ఇండియాకు చెందిన 19 ఆస్తులను సెబీ వేలం వేయనుంది. కేబీసీఎల్, కంపెనీ డైరెక్టర్లు రాకేశ్‌ కుమార్, విశ్వనాధ్‌ ప్రతాప్‌ సింగ్, శశికాంత్‌ మిశ్రా, మదుపర్ల సొమ్ములను రిఫండ్‌ చేయడంలో విఫలం కావడంతో సెబీ ఆ కంపెనీల ఆస్తుల వేలం ప్రక్రియను ప్రారంభించింది. 
  • బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌లో 3.54% వాటాను రూ.1,504 కోట్లకు బెయిన్‌ కేపిటల్, బీఎన్‌పీ పరిబాస్‌ సంస్థలు విక్రయించాయి. ఇందులో బెయిన్‌ కేపిటల్‌ తన అనుబంధ సంస్థలు బీసీ ఏషియా గ్రోత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, బీసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా 1.2% వాటాను, బీఎన్‌పీ పరిబాస్‌ తన అనుబంధ సంస్థ బీఎన్‌పీ పరిబాస్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ ద్వారా 2.32% వాటాను విక్రయించాయి.  
  • రిలయన్స్‌ కేపిటల్‌ దివాలా పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేందుకు గడువు పొడిగించాలంటూ హిందుజా గ్రూపు సంస్థ ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఐఐహెచ్‌ఎల్‌) దాఖలు చేసిన దరఖాస్తుపై ఈనెల 20న ఎన్‌సీఎల్‌టీ విచారణ చేయనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని