Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులు..చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి...

Published : 27 Sep 2022 15:57 IST

 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఇలా ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన సూచీల పయనం చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాల్లో ఉండడం సూచీల నష్టాల్ని పరిమితం చేసింది. మరోవైపు ఆసియా సూచీలు సైతం నేడు సానుకూలంగా కదలాడాయి. ఈ నేపథ్యంలో 4 రోజుల వరుస అమ్మకాల వెల్లువ ఈరోజు కొంత తగ్గింది. గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపినప్పటికీ.. రేట్ల పెంపు, మాంద్యం, రూపాయి బలహీనత వంటి పరిణామాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,376.52 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 57,704.57 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 56,950.52 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 37.70 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,107.52 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8.90 పాయింట్లు కోల్పోయి 17,007.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,176.45- 16,942.35 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, ఐటీసీ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. టాటా స్టీల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

భారత్‌ గేర్స్‌ షేర్లు ఈరోజు 20 శాతం వరకు లాభపడ్డాయి. ఈ కంపెనీ ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి రికార్డు తేదీని సెప్టెంబరు 28గా నిర్ణయించడంతో మదుపర్లు ఒక్కసారిగా కొనుగోళ్లకు దిగారు. చివరకు షేరు ధర 19.97 శాతం పెరిగి రూ.167.30 వద్ద ముగిసింది.

పాలిమర్‌ కాంపౌండ్‌ ఉత్పత్తి కోసం గ్రీన్‌పీల్డ్‌ ఫెసిలిటీని అభివృద్ధి చేయనున్నట్లు హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 3.03 శాతం లాభపడి రూ.71.30 వద్ద స్థిరపడింది.

ఆరు కంపెనీల విలీన ప్రకటన తర్వాత వచ్చిన ర్యాలీని టాటా స్టీల్‌ కోల్పోయింది. గత రెండు రోజుల్లో ఈ కంపెనీ షేరు 7 శాతం వరకు నష్టపోయింది. ఈరోజు ఓ దశలో 3 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 1.90 శాతం నష్టంతో రూ.97.95 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు