Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి చేరిన నేపథ్యంలో మార్కెట్లు ఉత్సాహంగా చలిస్తున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా తోడయ్యాయి.

Published : 13 Dec 2022 09:31 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. దేశీయంగా నవంబరు నెలలో ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 121 పాయింట్ల లాభంతో 62,252 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 31 పాయింట్లు లాభపడి 18,528 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మైక్రోసాఫ్ట్‌, ఫైజర్‌ షేర్లలో కొనుగోళ్ల వెల్లువ అక్కడి సూచీలకు కలిసొచ్చింది. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ.138.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. నేడు ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ ఐపీఓ (Landmark Cars IPO) ప్రారంభం కానుంది. డిసెంబరు 15న ముగియనుంది.

గమనించాల్సిన స్టాక్స్‌..

దాల్మియా భారత్‌: జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు చెందిన 9.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్‌ ప్లాంట్‌లను దాల్మియా భారత్‌ కొనుగోలు చేయనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌: వ్యాపార విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌ బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించింది.

వన్‌ 97కమ్యూనికేషన్స్‌ (పేటీఎం): తమ రుణాల మంజూరు మొత్తం రూ.39,000 కోట్ల ‘యాన్యువలైజ్డ్‌ రన్‌ రేట్‌’కు చేరిందని పేటీఎం సోమవారం వెల్లడించింది.

స్టీల్‌ స్టాక్స్‌: ప్రభుత్వ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకం (PLI)’ కింద పలు స్టీల్‌ కంపెనీలు ఎంపిక అయ్యాయి.

రూట్‌ మొబైల్‌: మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఏ2పీ ఫైర్‌వాల్‌ సొల్యూషన్స్‌ను ఉగాండా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్‌కు అందించేందుకు రూట్‌ మొబైల్‌ అనుబంధ సంస్థ 365స్క్వేర్డ్‌ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది.

కేఈసీ ఇంటర్నేషనల్‌: రూ.1,349 కోట్లు విలువ చేసే కొత్త ఆర్డర్లు కేఈసీ ఇంటర్నేషనల్‌ దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని