Stock Market: మార్కెట్‌ సూచీలకు స్వల్ప నష్టాలు.. 16,950ని నిలబెట్టుకున్న నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 40.14 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613.72 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 34 పాయింట్లు నష్టపోయి 16,951.70 దగ్గర ముగిసింది.

Published : 28 Mar 2023 16:08 IST

 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లకు కాసేపటికే అమ్మకాల సెగ తగిలింది. దీంతో రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య చలించాయి. రేపు వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ ఉండడం, ఆర్థిక సంవత్సర ముగింపు వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. అలాగే వచ్చే వారం జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమావేశంపైనా మదుపర్లు దృష్టి సారించారు.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 57,751.50 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,949.45- 57,494.91 మధ్య ట్రేడైంది. చివరకు 40.14 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613.72 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,031.75 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,061.75- 16,913.75 కదలాడింది. చివరకు 34 పాయింట్లు నష్టపోయి 16,951.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 82.20 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్స్‌లో ఈరోజు అమ్మకాలు వెల్లువెత్తాయి. అంబుజా, ఏసీసీ కంపెనీలను కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించాలని అదానీ గ్రూప్‌ బ్యాంకులను కోరినట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. గ్రూప్‌లోని ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 7 శాతానికి పైగా పతనమైంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌ షేర్లు ఈరోజు 4.37 శాతం నష్టపోయి రూ.127.90 దగ్గర స్థిరపడింది. ఈరోజు దాదాపు 15 లక్షల షేర్లు చేతులు మారాయని సమాచారం.

బంధన్‌ బ్యాంకు షేరు ఇంట్రాడేలో రూ.185.45 దగ్గర మూడేళ్ల కనిష్ఠాన్ని తాకింది. గత రెండు నెలల్లో ఈ స్టాక్‌ 23 శాతం నష్టపోయింది. ఈరోజు షేరు చివరకు 5.33 శాతం నష్టంతో రూ.187.25 దగ్గర ముగిసింది. 

రూ.819 కోట్లు విలువ చేసే రహదారి ప్రాజెక్టు లభించిన నేపథ్యంలో పీఎన్‌సీ ఇన్‌ఫ్రా షేరు ఈరోజు 6.37 శాతం పెరిగి రూ.282 దగ్గర స్థిరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని