Stock Market: నష్టాలతో ముగిసిన సూచీలు.. 62,000 దిగువకు సెన్సెక్స్‌

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 413.24 పాయింట్ల నష్టంతో 61,932.47 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 131.95 పాయింట్లు నష్టపోయి 18,266.90 దగ్గర ముగిసింది.

Updated : 16 May 2023 16:12 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు దొరకలేదు. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలను కిందకు లాగాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,474.11 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,847.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 413.24 పాయింట్ల నష్టంతో 61,932.47 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,432.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,264.35 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 131.95 పాయింట్లు నష్టపోయి 18,266.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 82.21 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, సన్‌ఫార్మా, రిలయన్స్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మార్చితో ముగిసిన త్రైమాసికంలో వెసువియస్‌ ఇండియా ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 20 శాతానికి పైగా పెరిగి రూ.2,268.80 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

మార్చి త్రైమాసికంలో ఐఓసీఎల్‌ ఆదాయం 9.4 శాతం పెరిగి రూ.2,30,711 కోట్లకు చేరింది. అదే సమయంలో Ebitda 19.40 శాతం పుంజుకొని రూ.17,699.35 కోట్లకు పెరిగింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 3.38 శాతం లాభపడి రూ.87.05 దగ్గర స్థిరపడింది.

రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై ఎంపీఎస్‌ లిమిటెడ్‌ రూ.20 డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 20 శాతం లాభపడి రూ.1,082 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

సొసైటీ ఆఫ్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌తో పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో పరాస్‌ డిఫెన్స్‌ షేరు విలువ 1.64 శాతం లాభపడి రూ.542.60 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని