Stock Market: భారీగా పతనమైన మార్కెట్లు.. 2రోజుల్లో ₹10 లక్షల కోట్లు ఆవిరి

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం అమ్మకాల వెల్లువతో కొట్టుమిట్టాడాయి. అదానీ షేర్ల పతనం సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది.

Updated : 27 Jan 2023 16:23 IST

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు మదుపర్లను శుక్రవారం భారీ నష్టాల్లో ముంచాయి. కీలక సూచీలు రెండు శాతానికి పైగా కుంగి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. క్రితం సెషన్‌లోనూ సూచీలు భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. రెండు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు దాదాపు రూ.10.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కూడా జరగనుంది. ఈ కీలక పరిణామాలకు మరికొన్ని ప్రతికూల అంశాలూ జతకావడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు మాత్రం అమ్మకాల వెల్లువతో కొట్టుమిట్టాడాయి.

అదానీ గ్రూప్‌ షేర్ల పతనం కూడా ఈరోజు మార్కెట్‌ సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ టోటల్‌ గ్యాస్ షేర్‌ 20 శాతం వరకు నష్టపోయింది. తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 18 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 16 శాతం వరకు నష్టపోయాయి. దీనికి బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు కూడా జతయ్యాయి. బడ్జెట్‌పై అంచనాలు, బాండ్ల రాబడుల్లో పెరుగుదల, చమురు ధరల్లో ఊగిసలాట కూడా సూచీల పతనంలో తమ వంతు పాత్ర పోషించాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,166.90 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 58,974.70 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 874.16 పాయింట్ల భారీ నష్టంతో 59,330.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,877.20 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,493.55 దగ్గర దిగువ స్థాయికి చేరుకుంది. చివరకు 287.60 పాయింట్ల నష్టంతో 17,604.35 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 22 షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

భారీ అమ్మకాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఈరోజు ఓ దశలో 3 శాతానికి పైగా నష్టపోయింది. రూ. 2,312 వద్ద పది నెలల కనిష్ఠానికి చేరింది. చివరకు 1.83 శాతం నష్టపోయి రూ. 2,339 వద్ద స్థిరపడింది.

బలహీన మార్కెట్‌లోనూ ఐటీసీ షేర్లు రాణించాయి. కంపెనీ షేరు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా పెరిగి రూ. 348.80 వద్ద మూడు నెలల గరిష్ఠానికి చేరింది. చివరకు 1.84 శాతం లాభంతో రూ. 345.50 వద్ద ముగిసింది.

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో టాటా మోటార్స్‌ గత రెండేళ్లలో తొలిసారి నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో సంస్థ షేర్లు ఈరోజు రాణించాయి. చివరకు 6.25 శాతం లాభంతో రూ. 445.25 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని