Stock Market: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు.. కొనసాగిన అదానీ షేర్ల ర్యాలీ

Stock Market:  సెన్సెక్స్‌ (Sensex) 18.11 పాయింట్ల లాభంతో 61,981.79 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 33.60 పాయింట్లు లాభపడి 18,348 దగ్గర ముగిసింది. 

Published : 23 May 2023 16:03 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి గంట వరకు అదే బాటలో పయనించాయి. చివర్లో వచ్చిన అమ్మకాలు సూచీలను దిగజార్చాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఆఖర్లో సూచీలను కిందుకు లాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను కలవరపర్చాయి. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ ఈరోజు కూడా కొనసాగింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,098.16 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,245.19 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 18.11 పాయింట్ల లాభంతో 61,981.79 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,362.90 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,419.75 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 33.60 పాయింట్లు లాభపడి 18,348 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 దగ్గర ఫ్లాట్‌గా స్థిరపడింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, విప్రో, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్ల ర్యాలీ వరుసగా మూడోరోజూ కొనసాగింది. సుప్రీం కోర్టు కమిటీ సమర్పించిన నివేదికను ఊరటగా భావిస్తున్న నేపథ్యంలో మదుపర్లు ఈ స్టాక్స్‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఈరోజు 13.49 శాతం పెరిగి రూ.2,639.95 దగ్గర స్థిరపడింది. ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

18వ వార్షికోత్సవం సందర్భంగా స్పైస్‌జెట్‌ ప్రత్యేక ధరలను ప్రకటించింది. కంపెనీ షేరు ఈరోజు 13.93 శాతం నష్టపోయి రూ.24.16 దగ్గర ముగిసింది.

బలమైన ఆదాయ అంచనాల నేపథ్యంలో దివీస్‌ లేటొరేటరీస్‌ షేరు విలువ గత రెండు రోజుల్లో 10 శాతానికి పైగా పెరిగింది. ఈరోజు షేరు ధర 3.61 శాతం పుంజుకొని రూ.3,383 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని