Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 18,650 దిగువకు నిఫ్టీ

Stock Market:  సెన్సెక్స్‌ (Sensex) 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 91.85 పాయింట్లు నష్టపోయి 18,634.55 దగ్గర ముగిసింది.

Published : 08 Jun 2023 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. దీంతో నాలుగు రోజుల వరస లాభాలకు బ్రేక్‌ పడింది. ఉదయం అప్రమత్తంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాల ప్రకటన తర్వాత పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు లాభాల్లోకి ఎగబాకాయి. కానీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం కఠిన విధాన వైఖరిని అవలంబిస్తామని ఆర్‌బీఐ ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులు ఎదుర్కొంటోందని.. అది భారత్‌పై కూడా ప్రభావం చూపుతుందనడం కూడా మదుపర్లను కలవరపెట్టింది. దీంతో గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 63,140.17 దగ్గర స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,321.40- 62,789.73 మధ్య కదలాడింది. చివరకు 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,725.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,777.90- 18,615.60 మధ్య ట్రేడైంది. చివరకు 91.85 పాయింట్లు నష్టపోయి 18,634.55 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పతనమై 82.57 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

ఎఫ్‌టీఏఐ ఏవియేషన్‌ 20 ఇంజిన్లను ఇవ్వడానికి తమతో ఒప్పందం కుదుర్చుకుందని స్పైస్‌జెట్‌ ప్రకటించింది. వచ్చే 2- 3 నెలల్లో మరికొన్ని విమానాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 4.37 శాతం పుంజుకొని రూ.27.93 దగ్గర ముగిసింది.

పేటీఎం షేరు ఇంట్రాడేలో 8 శాతానికి పైగా పెరిగి 9 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 6.29 శాతం పుంజుకొని రూ.772.50 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని