Stock Market: 17,000 దిగువకు నిఫ్టీ.. సూచీలను వెంటాడిన ‘బ్యాంకింగ్‌’ భయాలు!

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 111.65 పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది.

Updated : 20 Mar 2023 15:57 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఓ దశలో భారీ అమ్మకాల సెగతో సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. బ్యాంకింగ్‌ సంక్షోభ పరిణామాలు మార్కెట్లను వెంటాడాయి. దిగ్గజ షేర్ల పతనం సూచీలను మరింత కిందకు తీసుకెళ్లింది. మరోవైపు ఈ వారం జరగనున్న ఫెడ్‌ సమావేశం కూడా మదుపర్లను అప్రమత్తం చేసింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 57,773.55 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,084.91 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,066.60 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 16,828.35 దగ్గర ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 111.65  పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు కుంగి 82.62 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఐటీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, విప్రో, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌ నష్టాలకు కారణాలు..

బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం: ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌ సహా క్రెడిట్‌ సూయిజ్‌ వంటి బ్యాంకుల ఆర్థిక ఇబ్బందులు మార్కెట్లను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా సంస్థలను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇన్వెస్టర్లలో మాత్రం భయాలు తొలగడం లేదు. ఈ ప్రభావం మరికొన్ని బ్యాంకులకూ విస్తరించే ప్రమాదం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

యూఎస్‌ ఫెడ్‌ సమావేశం: ఈ వారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు భేటీ కానుంది. వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం నేపథ్యంలో ఫెడ్‌ తాత్కాలికంగా రేట్ల పెంపును నిలిపివేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడే లక్ష్యమని ప్రకటించిన ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఈ అనిశ్చితి మార్కెట్లను కలవరానికి గురిచేస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ల పతనం: పై కారణాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. క్రెడిట్‌ సూయిజ్‌ కొనుగోలు పరిణామం ఆసియా- పసిఫిక్‌ సూచీలు నెగెటివ్‌గా తీసుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు సైతం ప్రస్తుతం ప్రతికూలంగానే ఉన్నాయి. ఐరోపా మార్కెట్లూ అదే బాటలో ఉన్నాయి.

అదానీ గ్రూప్ షేర్ల పతనం: హిండెన్‌బర్గ్‌ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్‌ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మధ్యలో కొన్నిరోజులు రాణించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో తిరిగి నష్టాల బాట పట్టాయి. ఈరోజు అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌ లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ఒక్క అదానీ గ్రీన్‌ ఎనర్జీ మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

అగ్రిటెక్‌ సంస్థ మిత్రాను పూర్తిగా చేజిక్కించుకునేందుకు అందులోని ఓమ్నివోర్‌ వాటాను మహీంద్రా అండ్‌ మహీంద్రా కొనుగోలు చేసింది. ఎంఅండ్ఎం షేరు విలువ ఈరోజు 0.21 శాతం కోల్పోయి రూ.1,169 వద్ద స్థిరపడింది.

స్విస్‌ సూచీ ఎస్‌ఐఎక్స్‌లో క్రెడిట్‌ సూయిజ్‌ షేరు ఇంట్రాడేలో 63 శాతం పతనమైంది. మరోవైపు దీన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిన యూబీఎస్‌ షేరు విలువ సైతం 13 శాతం కుగింది.

అహ్లూవాలియా కాంట్రాక్ట్స్‌కు రూ.723 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించింది. షేరు ధర ఈరోజు 1.35 శాతం పెరిగి రూ.479 వద్ద ముగిసింది.

ఈరోజు ట్రేడింగ్‌లో రిలయన్స్‌, విప్రో, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, ఎంఫసిస్‌, లారస్‌ ల్యాబ్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, ఇమామి, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేర్లు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని