Stock Market: సూచీల్లో కొనసాగిన ‘బడ్జెట్‌’ అప్రమత్తత!

Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

Published : 31 Jan 2023 15:57 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. కొనుగోళ్ల మద్దతుతో చివర్లో స్వల్పంగా కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్నప్పటికీ.. ప్రపంచ మాంద్యం కారణంగా వచ్చే ఏడాది దేశ వృద్ధిరేటు నెమ్మదించనుందన్న ఆర్థిక సర్వే వ్యాఖ్యలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అలాగే రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 59,770.83 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,787.63- 59,104.59 మధ్య కదలాడింది. చివరకు 49.49 పాయింట్ల స్వల్ప లాభంతో 59,549.90 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి 400 పాయింట్లకు పైగా ఎగబాకడం గమనార్హం. నిఫ్టీ (Nifty) 17,731.45 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,735.70- 17,537.55 మధ్య ట్రేడయ్యింది. చివరకు 13.20 పాయింట్ల లాభంతో 17,662.15 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.90 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 15 షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, టైటన్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓలోని షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఉద్యోగుల కేటగిరీలో అత్యధిక స్పందన లభించింది. కంపెనీ షేరు ఈరోజు 1.91 శాతం పెరిగి రూ.2,948 వద్ద ముగిసింది.

మూడో త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సూర్య రోష్ని షేర్ల ర్యాలీ మూడోరోజూ కొనసాగింది. ఈరోజు షేరు ధర 6.23 శాతం పెరిగి రూ.641. 20 వద్ద స్థిరపడింది.

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.93 శాతం నష్టపోయి రూ.1,016.10 వద్ద నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని