Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 18,100 దిగువన నిఫ్టీ

Stock Market: ఆరంభంలోనే సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి.

Updated : 19 Jan 2023 09:41 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 224 పాయింట్ల నష్టంతో 60,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 70 పాయింట్లు నష్టపోయి 18,095 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.31 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, టీసీఎస్‌, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్‌ సూచీలు బుధవారం భారీగా కుంగాయి. డిసెంబరులో రిటైల్‌ విక్రయాలు ఏడాది కనిష్ఠానికి పడిపోవడం అక్కడి సూచీలను కలవరపెట్టింది. మరోవైపు కఠిన ద్రవ్య విధానాలు ఇంకా కొనసాగుతాయని ఫెడ్‌ అధికారులు చేసిన వ్యాఖ్యలూ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో మాంద్యం భయాలు మరింత బలపడుతుండడంతో చమురు ధరలు గురువారం 1 శాతం మేర తగ్గాయి. ఒకరోజు విరామం తర్వాత ఎఫ్‌ఐఐలు తిరిగి అమ్మకాలకు దిగారు. గురువారం విదేశీ మదుపర్లు రూ. 319.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, క్యాన్‌ఫిన్‌ హోమ్స్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌, హావెల్స్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) కోసం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు దరఖాస్తు (ఆఫర్‌ లెటర్‌) సమర్పించింది. ఎఫ్‌పీఓను జనవరి 27న ప్రారంభించి జనవరి 31న పూర్తి చేయనున్నారు. ఎఫ్‌పీఓలో ఒక్కో షేరును రూ.3112- 3,276 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు.

వేదాంతా: అప్పుల్లో మునిగిన విద్యుత్‌ ప్లాంటు మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లతో అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్‌ కొనుగోలు చేయనుంది. దివాలా ప్రక్రియలో తాము విజయవంతమైన బిడ్డరుగా నిలిచినట్లు వేదాంతా బుధవారం ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. మీనాక్షి ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంటు ఉంది.

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ ఎగుమతుల సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.535.64 కోట్ల ఆదాయాన్ని, రూ. 73.06 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.423.59 కోట్లు, నికరలాభం 58.46 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆకర్షణీయ ఫలితాలు నమోదయ్యాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డిసెంబరు త్రైమాసికానికి రూ.1964 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1242 కోట్ల కంటే ఇది 58 శాతం అధికం. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1654 కోట్ల నుంచి రూ.1065 కోట్లకు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడం ఇందుకు కారణాలు.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ప్రభుత్వరంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డిసెంబరు త్రైమాసికానికి రూ.458 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.279 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6523.78 కోట్ల నుంచి రూ.7635.71 కోట్లకు పెరిగింది.

ఎస్‌బీఐ: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రూ.9,718 కోట్లు సమీకరించింది. 15 ఏళ్ల కాలపరిమితి గల ఇన్‌ఫ్రాస్ట్రాక్చర్‌ డెట్‌ బాండ్లను జారీ చేసింది. వీటి కూపన్‌ రేటు 7.70 శాతం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని