Stock Market: రెండోరోజూ నష్టాలే.. 17,750 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ 220 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయాయి. దీంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు నమోదు చేశాయి.

Published : 07 Feb 2023 16:16 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. రేపు ఆర్‌బీఐ ద్వైమాసిక సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,511.32 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,655.14- 60,063.49 మధ్య కదలాడింది. చివరకు 220.86 పాయింట్ల నష్టంతో 60,286.04 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,790.10 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,811.15- 17,652.55 మధ్య ట్రేడయ్యింది. చివరకు 43.10 పాయింట్లు క్షీణించి 17,721.50 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

గతకొన్ని రోజులుగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో ఈరోజు కొంత ఉపశమన ర్యాలీ కనిపించింది. తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు రూ.9,200 కోట్ల చెల్లింపులు చేస్తామని సోమవారం అదానీ గ్రూప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఈరోజు 15.36 శాతం లాభపడి రూ.1,814 వద్ద స్థిరపడింది. అదానీ విల్మర్‌ సైతం 4.99 శాతం పెరిగి రూ.399.40 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ సైతం లాభాల్లో ముగిసింది.

రామ్‌కో సిమెంట్స్‌ మూడో త్రైమాసిక ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. లాభంలో 18 శాతం క్షీణత నమోదైంది. ఇంధనం, విద్యుత్‌ సహా నిర్వహణ వ్యయాలు పెరగడమే దీనికి కారణమని తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు 2.59 శాతం లాభంతో రూ.701.20 వద్ద స్థిరపపడింది.

పేటీఎం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. దీంతో రెండు రోజులుగా షేరు ర్యాలీ అవుతోంది. ఈరోజు స్టాక్‌ ధర 5.43 శాతం పెరిగి రూ.588.60 వద్ద ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు