Stock Market: ఆఖరి రోజు మార్కెట్ల జోరు.. సెన్సెక్స్‌కు 1,000 పాయింట్ల లాభం

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) చివరకు 1031.43 పాయింట్ల లాభంతో 58,991.52 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) చివరకు 279.05 పాయింట్లు లాభపడి 17,359.75 దగ్గర ముగిసింది.

Published : 31 Mar 2023 16:01 IST

ముంబయి: ఆర్థిక సంవత్సరం చివరి రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు మద్దతునిచ్చాయి. దీనికి దేశీయంగా దిగ్గజ కంపెనీల షేర్ల ర్యాలీ జతకావడంతో సూచీలు రాణించాయి.

లాభాలకు కారణాలు..

అంతర్జాతీయ సూచీలు: బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం వల్ల నెలకొన్న ఆందోళనలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయా దేశాలు బ్యాంకింగ్‌ రంగాన్ని ఆదుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంటు బలపడుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం అదే బాటలో పయనించాయి.

విదేశీ మదుపర్ల కొనుగోళ్లు: గతకొన్ని రోజుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ మదుపర్లు గురువారం భారీ ఎత్తున భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈరోజు కూడా అది కొనసాగింది. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో ఉన్నారు.

రిలయన్స్‌ ర్యాలీ: ఆర్థిక సేవల వ్యాపారాన్ని రిలయన్స్ వేరు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు మే 2న రుణదాతలు, షేర్‌హోల్డర్లతో సమావేశం నిర్వహించనుంది. వేరు చేసిన తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేర్లను జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JFS) పేరిట లిస్ట్‌ చేయనుంది. రిలయన్స్‌లో ఉన్న ఒక్కో షేరుకు మదుపర్లు ఒక్కో జేఎఫ్‌ఎస్‌ షేరును పొందనున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు ఏకంగా 4 శాతానికి పైగా లాభపడింది. దీనికి బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, వంటి దిగ్గజ షేర్ల ర్యాలీ కూడా జతైంది.

దిద్దుబాటులో లాభాల వేట: గతకొన్ని నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ దిద్దుబాటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో కీలక కంపెనీల షేరు విలువలు ఆకర్షణీయ స్థాయికి పడిపోయాయి. దీంతో అధిక లాభాల కోసం కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 58,273.86 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,068.47 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1031.43 పాయింట్ల లాభంతో 58,991.52 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,210.35 దగ్గర ప్రారంభమై 17,381.60 దగ్గర ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. చివరకు 279.05  పాయింట్లు లాభపడి 17,359.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 82.17 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో రిలయన్స్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

గత ఏడాది వ్యవధిలో ఎంఫసిస్‌ షేరు దాదాపు సగానికి పడిపోయింది. దీంతో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈరోజు కంపెనీ షేరు ఏకంగా 4.43 శాతం లాభపడి రూ.1,794.25 వద్ద స్థిరపడింది.

రక్షణ శాఖ నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు లభిస్తున్న నేపథ్యంలో డిఫెన్స్‌ కంపెనీ షేర్లు ఈరోజు కళకళలాడాయి.

భారత్‌కు చెందిన క్యాపిటల్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు నెస్లే ఎస్‌ఏ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నెస్లే ఇండియా షేరు ఈరోజు 3.29 శాతం పెరిగి రూ.19,680 దిగ్గర ముగిసింది.

హీరో మోటోకార్ప్‌ షేరు ఈరోజు 1.70 శాతం లాభపడి రూ.2,343 వద్ద ముగిసింది. సీఎఫ్‌ఓ నిరంజన్ గుప్తాకు కంపెనీ సీఈఓగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో షేరు సానుకూలంగా స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని