Stock Market: ఆఖరి అరగంటలో లాభాల్లోకి.. 17,750 పైకి నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 123.63 పాయింట్ల లాభంతో 60,348.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 42.95 పాయింట్లు లాభపడి 17,754.40 దగ్గర ముగిసింది.

Updated : 08 Mar 2023 16:05 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు ఆఖరి అరగంట వరకు అదే బాటలో పయనించాయి. చివర్లో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. మన సూచీలు మాత్రం సానుకూలంగా ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 59,916.10 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,402.85- 59,844.82 మధ్య కదలాడింది. చివరకు 123.63 పాయింట్ల లాభంతో 60,348.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,665.75 దగ్గర ప్రారంభమై 17,766.50- 17,602.25 మధ్య ట్రేడైంది. చివరకు 42.95 పాయింట్లు లాభపడి 17,754.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.99 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్, మారుతీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

రెండేళ్ల తర్జనభర్జనల తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లయిన కపిల్‌ వాద్వాన్‌, ధీరజ్‌ వాద్వాన్‌లను ఐడీబీఐ బ్యాంకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈరోజు ఐడీబీఐ బ్యాంక్‌ షేరు 0.51 శాతం నష్టపోయి రూ.48.95 వద్ద ముగిసింది. 

అడిషనల్‌ టైర్‌-1 బాండ్ల జారీ ద్వారా ఎస్‌బీఐ రూ.3,717 కోట్ల నిధులను సమీకరించింది. కూపన్‌ రేట్‌ 8.25 శాతం. ఎస్‌బీఐ షేరు ఈరోజు 0.41 శాతం పెరిగి రూ.564 వద్ద స్థిరపడింది.

రక్షణ శాఖ నుంచి మూడు భారీ శిక్షణ నౌకల నిర్మాణానికి ఆర్డర్‌ లభించిన నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు ఈరోజు 1.44 శాతం పెరిగి రూ.2,172 వద్ద స్థిరపడింది.

హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌ షేరు ఈరోజు 5.54 శాతం పెరిగి రూ.2,861 వద్ద స్థిరపడింది. రక్షణ శాఖ నుంచి 70 హెచ్‌టీటీ-40 బేసిక్‌ ట్రైనర్‌ విమానాలకు ఆర్డర్‌ ఖరారు కావడమే దీనికి కారణం.

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వరుసగా ఆరో రోజూ రాణించాయి. రుణాల ముందస్తు చెల్లింపు, జీక్యూజీ పార్ట్‌నర్స్‌ మరిన్ని వాటాలను కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.78 శాతం లాభపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని