Stock Market: ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: సెన్సెక్స్‌, నిఫ్టీ ఆరంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. 

Published : 02 Feb 2023 09:50 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం ఆరంభంలో ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 7 పాయింట్ల స్వల్ప తగ్గి 59,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 38 పాయింట్లు నష్టపోయి 17,578 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.81 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను మరో 0.25 శాతం పెంచింది. ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి వస్తోందని ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యల్ని మార్కెట్లు సానుకూలంగా తీసుకున్నాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు విదేశీ మదుపర్లు బుధవారం రూ.1,785.21 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టైటన్‌ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, అపోలో టైర్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బర్జర్‌ పెయింట్స్‌ ఇండియా, బిర్లా సాఫ్ట్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌, డాబర్‌ ఇండియా, దీపక్‌ ఫర్టిలైజర్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

అదానీ గ్రూప్‌ షేర్లు: రూ.20,000 కోట్ల ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకుంటున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. మదుపర్లకు డబ్బులు వెనక్కి ఇస్తామంది. ఈ నేపథ్యంలో నేడు అదానీ గ్రూప్‌ షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

బ్రిటానియా: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్రిటానియా లాభం రెండింతలైంది. అధిక ధరలు, గిరాకీ అందుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది.

బీమా కంపెనీల షేర్లు: వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు దాటిన జీవిత బీమా పథకాల మెచ్యూరిటీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో బుధవారమే బీమా కంపెనీల షేర్లు గరిష్ఠంగా 10 శాతం వరకు పడిపోయాయి. ఈ రోజు కూడా మదుపర్లు ఈ షేర్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.

రైల్‌టెల్‌: ఎస్‌బీఐ నుంచి 15,000 ఏటీఎంలకు 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ సేవలను అందించడంతో పాటు ఐదేళ్ల పాటు సర్వీసు నిమిత్తం రైల్‌టెల్‌కు రూ.253.35 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని