Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. 18,600 చేరువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 344.69 పాయింట్ల లాభంతో 62,846.38 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 99.30 పాయింట్లు లాభపడి 18,598.65 దగ్గర ముగిసింది.

Published : 29 May 2023 16:07 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపుపై పురోగతి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇదే మన మార్కెట్లలోనూ సానుకూలతలు నింపింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎంఅండ్‌ఎం వంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 63,000 మార్క్‌ను తాకడం విశేషం.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,801.54 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,026.00- 62,801.54 మధ్య కదలాడింది. చివరకు 344.69  పాయింట్ల లాభంతో 62,846.38 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,619.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,641.20- 18,581.25 మధ్య ట్రేడైంది. చివరకు 99.30 పాయింట్లు లాభపడి 18,598.65 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పతనమై 82.64 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎంఅండ్‌ఎం, టైటన్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, విప్రో, టీసీఎస్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

ఎస్‌ఎంఎల్‌ ఇసుజు ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 70 శాతం పెరిగింది. నికర లాభం రూ.26.79 కోట్లుగా నమోదైంది. కంపెనీ షేరు ఈరోజు రూ.1,124 దగ్గర ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 4.80 శాతం లాభపడి రూ.1,069 దగ్గర స్థిరపడింది.

జనవరి- మార్చి త్రైమాసికంలో ఎన్‌ఐఐటీ ఆదాయం 35.56 శాతం తగ్గి రూ.60.05 కోట్లకు చేరింది. అదే సమయలో నికర నష్టాలు 9.37 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 13 వారాల కనిష్ఠానికి చేరింది. చివరకు 1.40 శాతం నష్టపోయి రూ.399 దగ్గర నిలిచింది.

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో తిరిగి ర్యాలీ వస్తోంది. దీంతో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్లు కలిగిన దేశంగా మళ్లీ నిలిచింది. జనవరిలో భారత్‌ ఈ స్థానాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.

ఫేమ్‌-2 రాయితీ పథకం నుంచి గ్రీవ్స్‌ కాటన్‌ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 10.22 శాతానికి పైగా నష్టపోయి రూ.133.15 దగ్గర స్థిరపడింది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 2 శాతానికి పైగా పెరిగి రూ.1,294.65 దగ్గర మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1లక్ష కోట్లను తాకింది. చివరకు కంపెనీ షేరు 1.21 శాతం లాభపడి రూ.1,283.35 దగ్గర ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని