Stock Market: రెండోరోజూ నష్టాలే.. మళ్లీ 17,000 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 398.18 పాయింట్ల నష్టంతో 57,527.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 131.85 పాయింట్లు నష్టపోయి 16,945.05 దగ్గర ముగిసింది.

Updated : 24 Mar 2023 16:09 IST

Stock Market Update | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ఉదయం ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించాయి. కాసేపటికే నష్టాల్లోకి జారుకొని మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే కనిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు బ్యాంకింగ్‌ సంక్షోభం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం భయాలు మదుపర్లను వెంటాడాయి. రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు నష్టపోవడమూ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 57,890.66 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,066.40- 57,422.98 మధ్య కదలాడింది. చివరకు 398.18 పాయింట్ల నష్టంతో 57,527.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,076.20 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,109.45- 16,917.35 మధ్య ట్రేడైంది. చివరకు 131.85 పాయింట్లు నష్టపోయి 16,945.05 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 27 పైసలు పతనమై 82.47 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

జేకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు రూ.249 కోట్లు విలువ చేసే ప్రాజెక్టు లభించింది. అయినప్పటికీ కంపెనీ షేరు ఈరోజు 1.04 శాతం నష్టపోయి రూ.242.50 వద్ద స్థిరపడింది.

వార్షిక బీమా ప్రీమియం రూ. ఐదు లక్షలు దాటే పాలసీలపై వచ్చే రాబడిపై పన్ను విధించాలన్న బడ్జెట్‌ ప్రతిపాదనకు ఈరోజు పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎల్ఐసీ నష్టపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని