Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంరత్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Published : 09 Dec 2022 09:43 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 43 పాయింట్ల లాభంతో 62,613 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 19 పాయింట్లు లాభపడి 18,628 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, మారుతీ, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వరుసగా ఐదు రోజుల పాటు నష్టాలు చవిచూసిన అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకొని ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం సానుకూలంగా కదలాడుతున్నాయి. అమెరికాలో వీక్లీ నిరుద్యోగ క్లెయింలు పెరిగాయి. దీంతో రేట్ల పెంపు విషయంలో ఫెడ్‌ వెనక్కి తగ్గొచ్చన్న విశ్లేషణలు సూచీలకు బలం చేకూర్చాయి. మరోవైపు చైనాలో కొవిడ్‌ ఆంక్షల్ని సడలిస్తుండడంతో విదేశీ మదుపర్లు అక్కడి మార్కెట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిన్న భారత మార్కెట్లో ఎఫ్‌ఐఐలు రూ.1,131.67 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

వన్‌97 కమ్యూనికేషన్స్‌ (Paytm): ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ నిమిత్తం డిసెంబరు 13న పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ బోర్డు భేటీ కానుంది.

హెచ్‌యూఎల్‌: ఒజైవా బ్రాండ్‌ పేరుతో వృక్ష ఆధారిత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైవీ వెంచర్స్‌, దాని అనుబంధ సంస్థ జెన్‌హెర్బ్‌ ల్యాబ్స్‌లో హెచ్‌యూఎల్‌ మెజారిటీ వాటాలను కొనుగోలు చేసింది.

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (JCPL): మోన్నెట్‌ పవర్‌ కొనుగోలు ప్రక్రియను జిందాల్‌ స్టీల్‌ పూర్తి చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌: విద్యుత్తు, రోడ్డు నిర్మాణంలోని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకుగానూ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది.

అశోక్‌ లేల్యాండ్‌: శేషు అగర్వాల్‌ను ఎండీ, సీఈఓగా నియమిస్తూ అశోక్‌ లేల్యాండ్‌ గురువారం ప్రకటన చేసింది. శేషు గతంలో ఎస్కార్ట్స్‌ కుబోటాలో అధ్యక్షుడి హోదాలో పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని