Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 18,100 పైకి నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభంతో ముగిశాయి. ఇంట్రాడేలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 వారాల గరిష్ఠానికి చేరడం విశేషం.

Updated : 23 Jan 2023 16:01 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. మరోవైపు సానుకూల కార్పొరేట్‌ ఫలితాలు సైతం సూచీలకు దన్నుగా నిలిచాయి. ఉదయం ట్రేడింగ్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 వారాల గరిష్ఠానికి చేరుకోవడమూ మార్కెట్లకు కలిసొచ్చింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,876.01 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,113.27- 60,761.88 మధ్య కదలాడింది. చివరకు 319.90 పాయింట్ల లాభంతో 60,941.67 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,118.45 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 18,162.60- 18,063.45 మధ్య చలించింది. చివరకు 90.90 పాయింట్లు లాభపడి 18,118.55 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.33 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 22 షేర్లు లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, టైటన్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ ఫలితాలు అంచనాలను అందుకోవడంతో కంపెనీ షేరు ఉదయం సెషన్‌లో 1 శాతానికి పైగా లాభపడింది. కానీ, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ ఎదురుకావడంతో చివరకు 0.60 శాతం నష్టపోయి రూ.2,428 వద్ద స్థిరపడింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ లాభం రూ. 15,792 కోట్లుగా నమోదైంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు సైతం అంచనాలకు అనుగుణంగా ఉండడంతో కంపెనీ షేరు ఉదయం సెషన్‌లో ఒకశాతానికి పైగా పెరిగింది. తర్వాత కొనుగోళ్లు నెమ్మదించడంతో చివరకు 0.15 శాతం లాభపడి రూ. 872.05 వద్ద ముగిసింది.

డిసెంబరు త్రైమాసికంలో యెస్‌ బ్యాంక్‌ బలహీన ఫలితాలను పోస్ట్‌ చేసింది. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 12 శాతానికి పైగా నష్టపోయింది. చివరకు 8.10 శాతం నష్టంతో రూ. 18.15 వద్ద స్థిరపడింది.

ఇటీవల ప్రకటించిన ‘పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌’ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. గత మూడు రోజుల్లో షేరు విలువ 15 శాతానికి పైగా పెరిగి 9 నెలల గరిష్ఠానికి చేరింది. ఈరోజు 5.17 శాతం లాభంతో రూ. 4,547 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని