Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 18,400 దిగువకు నిఫ్టీ

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో చలిస్తున్నాయి.

Published : 12 Dec 2022 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 488 పాయింట్ల నష్టంతో 61,693 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 143 పాయింట్లు నష్టపోయి 18,353 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.61 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, విప్రో అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు గతవారానికి నష్టాలతో ముగింపు పలికాయి. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ ప్రతికూలంగా చలిస్తున్నాయి. ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకునే నిర్ణయాలపైనే అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీ రేట్లను 50 లేదా 75 బేసిస్‌ పాయింట్ల మేర ఫెడ్‌ పెంచొచ్చన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. మన కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఫెడ్‌ నిర్ణయాలు వెలువడతాయి. అప్పటివరకు మార్కెట్లు స్తబ్ధుగా చలించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 15న ఐరోపా, బ్రిటన్‌ కేంద్ర బ్యాంకులూ సమావేశం కానున్నాయి. నవంబరుకు సంబంధించి మనదేశంతో పాటు అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను మదుపర్లు గమనించొచ్చు.

గమనించాల్సిన స్టాక్స్‌..

జైప్రకాశ్‌ అసోసియేట్స్: మధ్యప్రదేశ్‌లోని తమ నిల్‌గ్రీ సిమెంట్‌ యూనిట్‌ను విక్రయించే విషయంపై జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ ఈరోజు బోర్డు సమావేశం నిర్వహించనుంది.

ఎన్‌డీటీవీ: ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ మొత్తం వాటా 37.44 శాతానికి చేరింది. దీంతో అదానీ గ్రూప్‌ నుంచి ఇద్దరు డైరెక్టర్లను బోర్డులోకి తీసుకోనున్నట్లు ఎన్‌డీటీవీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ నెల 23న జరిగే సమావేశంలో నియామక ప్రక్రియను చేపడతామని తెలిపింది.

మహీంద్రా హాలిడేస్: కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.1,500 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని మహీంద్రా హాలిడేస్‌ నిర్ణయించింది.

యెస్‌ బ్యాంక్‌: కార్లీ గ్రూప్‌, వెర్వెంటా హోల్డింగ్స్‌ నుంచి మూలధనాన్ని సమకూర్చుకోవాలన్న యెస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఆర్‌బీఐ రెండు లేఖలు పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని