Stock Market: సెన్సెక్స్‌లో 5సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌.. 17,800 దిగువకు నిఫ్టీ!

Stock Market: సెన్సెక్స్‌ 334 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది.

Published : 06 Feb 2023 16:16 IST

 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిలయన్స్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా రావడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపుపై కఠినంగా వ్యవహరించొచ్చనే అంచనాలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలూ సూచీలను దెబ్బతీశాయి.   

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,847.21 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,847.21- 60,345.61 మధ్య కదలాడింది. చివరకు 334.98 పాయింట్ల నష్టంతో 60,506.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,818.55 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,823.70- 17,698.35 మధ్య ట్రేడయ్యింది. చివరకు 89.45 పాయింట్లు క్షీణించి 17,764.60 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎనిమిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, విప్రో, రిలయన్స్‌, మారుతీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ మినహా అదానీ గ్రూప్‌నకు చెందిన మిగిలిన అన్ని షేర్లు నేడు లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

ఆల్ఫాజియో (ఇండియా)కు రూ.15.31 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ దక్కింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 2.83 శాతం లాభపడి రూ.266.75 వద్ద స్థిరపడింది.

ఈజీట్రిప్‌ ప్లానర్స్‌ నేడు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. లాభం 4.2 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 4.25 శాతం లాభపడి రూ. 52.70 దగ్గర ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని